నిరాశగా వెనుదిరిగన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఫలించడం లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. మూడు రోజుల పాటు ఉన్నా అమిత్ షా అపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదు. కేవలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇన్‌ఛార్జి మురళీధరన్ మాత్రమే పవన్ కలవగలిగారు. అంతకు మించి ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికలు సమీపిస్తుండటం, వారాహి యాత్రను కూడా త్వరలో ప్రారంభించాల్సి రావడంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దల వద్దనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయి హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నారు. రోడ్డు మ్యాప్ కోసం అడగేందుకని చెబుతున్నా.. టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేయాలన్నదే పవన్ ఆలోచన. అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు.
టీడీపీతో కలసి...
తన ఆలోచనను మాత్రం జేపీ నడ్డా, ఇన్ చార్జి మురళీధరన్ ముందు ఉంచారంటున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. అమిత్ షాను కలిస్తే తప్ప క్లారిటీ రాదు. అమిత్ షా కొంత టీడీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారన్న సమాచారం వచ్చిన తర్వాతనే ఢిల్లీకి జనసేనాని వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా అందుకు అంగీకరిస్తే తాను పొత్తుపై చర్చలు ప్రారంభించవచ్చన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే ఓపిగ్గా ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం వేసినట్లు సమాచారం. కానీ అమిత్ షా నుంచి కలవాలని మాత్రంపిలుపు రాకపోవడంతో పవన్ కొంత అసహనంతోనే ఉన్నారని తెలిసింది.
హోటల్ గదికే...
సినిమా షూటింగ్‌లతో బీజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఫైనల్ డీల్ కుదుర్చుకుందామని వెళ్లారు. కానీ మూడు రోజులు వెయిటింగ్‌లో ఉంచడం బీజేపీ పెద్దల ఆలోచన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోందంటున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ హైకమాండ్ ఇష్టంగా లేదన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. చంద్రబాబు మోదీపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలతో పాటు, కేంద్ర ఇంటలిజెన్స్ సర్వే ప్రకారం వైసీపీకే అధిక స్థానాలు దక్కుతాయని తేలడంతో టీడీపీని దూరంగానే ఉంచాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పవన్ కు మూడు రోజుల పాటు అపాయింట్‌మెంట్ లభించలేదని చెబుతున్నారు.
బీజేపీని వదులుకునేందుకు...
మరోవైపు పవన్ కల్యాణ‌్ బీజేపీని వదులుకునేందుకు కూడా సిద్ధంగా లేరు. తనకు కేంద్ర నాయకులంటే ఇష్టమని, రాష్ట్ర నాయకులతోనే తనకు పొసగదని ఆ మధ్య పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలసి రాష్ట్రంలో పనిచేయాలంటే ఢిల్లీ పెద్దల సహకారం అవసరమని పవన్ భావించి ఓపికతో మూడు రోజులు వేచి ఉన్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి ఫుల్లు క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇక్కడ పొత్తుల విషయంపై ముందుకు వెళ్లాలన్న యోచనలో పవన్ ఉన్నారంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ మూడు రోజుల హస్తిన పర్యటన అనుకున్నంత మేర... ఆశించినంత రీతిలో జరగలేదన్నది వాస్తవం. మరి పవన్ కల్యాణ్ తదుపరి అడుగు ఎలా పడుతుందన్నది చూడాల్సి ఉంది.