వారాహి.. డేంజర్ జర్నీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఆయన కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది

Update: 2022-12-29 08:17 GMT

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తాయి. అందులో భాగంగా కొందరు పాదయాత్రలకు శ్రీకారం చుడుతుంటే, మరికొందరు బస్సు యాత్రలు, ఇంకొందరు రోడ్ షోలతో జనం చెంతకు వెళుతున్నారు. తప్పులేదు. జనం మద్దతును ఎలాగైనా కోరవచ్చు. అయితే నిన్న జరిగిన కందుకూరు ఘటనతో అన్ని రాజకీయ పార్టీలు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కందుకూరు ఘటన పొలిటికల్ పార్టీ లీడర్స్ కు డేంజర్ బెల్స్ ను మోగించినట్లయింది.


త్వరలోనే బస్సుయాత్ర...

కార్యకర్తలు ఊపు మీద ఉంటారు. తమ పార్టీ అధినేతను చూడాలని పరితపించిపోతుంటారు. రాజధానిలోనూ, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే అధినేత తమ ఊరికి వచ్చినప్పుడు వారు వీరంగమే చేస్తారు. అదే ప్రమాదాలకు దారి తీస్తుంది. నిన్న కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో కూడా అదే జరిగింది. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే బస్సు యాత్రకు బయలుదేరుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు వారాహి వాహనాన్ని కూడా పవన్ సిద్ధం చేసుకున్నారు. తేదీ ప్రకటించకపోయినా ఆయన వచ్చే ఏడాది ఆరంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు.
పవన్ కు పిచ్చి ఫ్యాన్స్...
అందరిదీ వేరు.. పవన్ పరిస్థితి వేరు. పవన్ రాజకీయ నేత మాత్రమే కాదు సినీ స్టార్. అందులోనూ లక్షలాది మంది అభిమానులున్న జనసేనాని తమ ప్రాంతానికి వస్తున్నారంటే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాదు. నిర్వాహకుల వల్ల అసలే కాదు. అందులో పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై ఉండి ప్రసంగిస్తారు. అంటే వాహనం కూడా వీధుల్లోనుంచే వెళుతుంది. ఈ సందర్భంగా పవన్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అందులో పిచ్చి అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు.

తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే..?
అందుకే పవన్ వారాహి యాత్రలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రూపొందించుకున్న రూట్ మ్యాప్ ప్రకారం పెద్ద స్థలం ఉన్న ప్రాంతంలోనే వారాహి వాహనం ద్వారా పవన్ ప్రసంగిస్తేనే మేలన్న సూచనలు వినిపిస్తున్నాయి. పవన్ పాదయాత్ర చేయకపోవడానికి కూడా ప్రధాన కారణం ఆయన ఫ్యాన్స్ అనే. విరగబడి వచ్చేవారిని అదుపు చేయడం కష్టమని భావించిన పవన్ బస్సుయాత్రను ఎంచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు రోడ్ షోల కందుకూరులో జరిగిన ఘటనతో పవన్ కల్యాణ్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పోలీసుల సూచనలను పాటిస్తూ అభిమానులు, పార్టీ కార్యకర్తల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పవన్ పైనే ఉండనుంది. పోలీసులు అనుమతి ఇచ్చిన చోటనే సభ పెట్టుకోవాల్సి ఉంటుంది. పోలీసుల నిబంధనలను పాటించకపోతే కందుకూరు లాంటి ఘటనలు రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని పోలీసు అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News