కూలీ మాదిరి పనిచేస్తా....
ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నానని, టీడీపీని అందలమెక్కించడానికే వచ్చానని విమర్శలు చేస్తున్నారన్నారు. వంగవీటి రంగా అంటే తనకు ఇష్టమని, ఆయనను చంపేస్తున్నారని చెబితే ఆయనను ఎందుకు కాపాడలేకపోయారని పవన్ ప్రశ్నించారు. చనిపోయిన తర్వాత ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏంటని పవన్ నిలదీశారు. వంగవీటి రంగా కమ్మ మహిళను పెళ్లి చేసుకున్నారని, వంగవీటి రాధా కాపు, కమ్మలకు పుట్టిన వ్యక్తి అని అన్నారు. ఎందుకు కులం పట్టుకుని వేలాడతారన్నారు. మచిలీపట్నంలో జరిగిన పదో ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. కాపులే ఓట్లు వేసి ఉంటే గత ఎన్నికల్లో గెలిచేవాడినని తెలిపారు. కాపుయువతలో పరివర్తన రావాలన్నారు. జనసేన భాషలను, యాసలను గౌరవించే సంప్రదాయమని తెలిపారు.
అలా చేస్తే పొత్తు నుంచి...
కుల,మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఏ కులాన్ని తాను గద్దెనెక్కించడానికి రాలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉందంటే ముస్లింలు దూరమవుతున్నారని, ఏదైనా దాడులు వాళ్ల మీద జరిగితే వెంటనే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు. ముస్లిం సామాజికవర్గం జగన్ కు మద్దతిస్తుందని, ఢిల్లీలో జగన్ ఏ పార్టీకి సపోర్టు చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ముస్లింలపై ఎవరైనా చెయ్యెత్తితే తాటతీస్తామని హెచ్చరించారు. మతం సున్నితమైన అంశమని, మతం అంటే ఒక అభిప్రాయమని పవన్ అన్నారు. రామతీర్థం ఆలయంలో ఘటన జరిగితే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదన్నారు. ప్రజలను మతపరంగా విభజించి తమ పబ్బం గడుపుకోవాడికే ప్రయత్నిస్తున్నారన్నారు.కులాల ఉచ్చులో యువత పడవద్దని పవన్ అన్నారు. అవినీతిపైన రాజీలేని పోరాటం చేస్తామని, జవాబుదారీతనం, పారదర్శకత తీసుకువస్తామని తెలిపారు. ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుదని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి దానిని ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
మద్యనిషేధం సాధ్యం కాదు...
వైసీపీ ప్రభుత్వంలో ఒక కులానికి మాత్రమే పదవులు ఇస్తుందన్నారు. అన్నీ పదవులు సామాజికవర్గానికే ఇస్తే మిగిలిన కులాలు ఏమయిపోవాలని పవన్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమానమైన అధికారాలను ఇస్తామని చెప్పారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదని, అది ప్రజల బలహీనత అని అన్నారు. అంచెలంచెలుగా చేయవచ్చు కాని పూర్తిగా చేస్తామని మోసపుచ్చలేమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహానుభావుడయితే తాను అస్త్రసన్యాసం చేస్తానని తెలిపారు. రాష్ట్రం గంజాయి మత్తులో తూగుతుందన్నారు. జనసేన అధికారంలోకి రాగానే గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తామని తెలిపారు. వైసీపీ నేతలు మగతనం గురించి మాట్లాడుతున్నారని, అధికారంలోకి రాగానే చూపిస్తామని, మాట్లాడిన ప్రతి మాటకు శిస్తు కట్టాల్సిందేనని అన్నారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని సవాల్ చేస్తున్నారని, కానీ జనసేన బలం ఏంటో తమకు తెలుసునని అన్నారు. మదమెక్కి మాట్లాడుతున్నారని, వైసీపీ రెండు తొడలు ప్రజా తీర్పు ద్వారా పగలకొడతామని అన్నారు. ఈసారి జనసేనకు మద్దతివ్వాలని రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నానని కోరారు.
కాపులు పెద్దన్న పాత్ర వహించాలి...
భావితరాల భవిష్యత్ కోసం ఒక్కసారి అండగా నిలబడండని కోరారు. కాపులు కూడా తనను నమ్మాలని, నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని, మీరు ఓటేస్తే ముఖ్యమంత్రిని అవుతానని పవన్ తెలిపారు. కాపులు నిర్ణయాత్మక శక్తి అని, వారు తలచుకుంటే సీఎం అవుతానని తెలిపారు. కాపులు పెద్దన్న పాత్ర వహించాలని, బీసీలను దగ్గరకు తీసుకోవాలని అన్నారు. కాపులు ఎదగాలంటే కమ్మవారితో గొడవపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాపుల్లో ఐక్యత లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే బీసీలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని అన్నారు. క్రిమినల్స్ పాలిటిక్స్ నుంచి రాష్ట్రాన్ని కాపులే మార్చగలరన్నారు. తాను నిజాయితీగా ఉంటానని, తనకు డబ్బు అసవరం లేదన్నారు.