మటన్ బిర్యానీ.. చికెన్ కర్రీ.. బీసీ సభకు మెనూ ఇదే
రేపు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. బీసీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
రేపు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. బీసీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు ఎనభై వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని అంచనా. బీసీ కులాలకు చెందిన వారిలో పదవులు పొందిన వారు ఈ సభకు హాజరవుతారని చెబుతున్నారు. బీసీ మంత్రుల నుంచి కార్పొరేషన్ డైరెక్టర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు, ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు, పంచాయతీ సర్పంచ్ లతో సహా ఎనభై వేల మంది వరకూ హాజరు కానున్నారు.
రేపు ఉదయం...
రేపు ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కొందరు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ సదస్సులో పాల్గొని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేశారో ఆయన వివరించనున్నారు. వచ్చే ఎన్నికలలో బీసీ ఓటర్లను పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ఏమేం చేయాలో? దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ తో పాటు వైసీపీ ఎంపీలు, మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
టిఫిన్ కోసం...
అయితే ఈ సదస్సు కోసం నూరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక మెనూను రూపొందించారు. ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి సిద్ధం చేశారు. సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, రవ్వకేసరితో పాటు టీ, కాఫీలను కూడా వచ్చిన వారికి అందచేస్తారు.
మాంసాహార ప్రియులకు...
మధ్యాహ్న భోజనం కోసం మాంసాహార ప్రియులకు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యల కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలిని అందించనున్నారు. వెజిటేరియన్లకు పనసకాయ థమ్ వెజ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమాటా పప్పు, గోంగూరు పచ్చడి, వైట్ రైస్, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలిని అందచేస్తారు ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ ను కూడా అందచేయనున్నారు.