ట్రాక్ రికార్డు తారుమారవుతుందా?
జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గం సమావేశాలకు హాజరు కావడం చర్చనీయాంశమైంది.
ఆయన అసలు పేరు వి.వి. లక్ష్మీనారాయణ. కానీ జేడీ లక్ష్మీనారాయణగా పేరు స్థిరపడిపోయింది. దీనికి కారణం ఆయన నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకోవడమే. జగన్ పై సీబీఐ కేసులను జేడీయే విచారించారు. దీంతో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. జగన్ అభిమానులు జేడీని వ్యతిరేకించినా ఎక్కువ మంది ఆయనను అభిమానించారు. అందుకు కారణం ఆయనకున్న ట్రాక్ రికార్డు మాత్రమే.
సీీబీఐ అధికారిగా....
సరే జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ పెడతారని భావించారు. ఆయన జనసేనలో చేరినా ఎవరూ ఆక్షేపించలేదు. విశాఖపట్నం పార్లమెంటుకు పోటీ చేసి గట్ట ిపోటీ ఇచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయినా ఆయన జనం అత్యధికంగా మద్దతు పలికారు. దానికి కారణం ఆయన మీద ఉన్న సాప్ట్ కార్నర్ మాత్రమే.
కులం ముద్ర....
అలాంటి జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గం సమావేశాలకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఆయన కూడా కులం ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఒక సామాజికవర్గానికి చెందిన వారుగా ఎవరూ చూడలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కులాలు బలంగా పనిచేస్తాయి. తమ కులం వారినే ఆయా సామాజికవర్గాలు అక్కున చేర్చుకుంటాయి. కానీ జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ఇప్పటి వరకూ కులం చూడలేదు. ఆయనను ఒక నిజాయితీగల అధికారిగానే చూశారు.
తప్పటడగేనా?
కులాలు, మతాలకు అతీతంగా అధికారిగా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక కులానికే పరిమితమైన నేతగా మిగిలిపోయారు. కాపు సామాజికవర్గం సమావేశాల్లో పాల్గొని ఆయన రాజకీయంగా తప్పటడుగు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత సామాజికవర్గం గురించి ఆలోచించడంలో తప్పులేదు కాని, జేడీ వంటి వారు ఇలాంటి సమావేశాలకు హాజరుకావడం రాజకీయాలకు మంచి సంప్రదాయం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.