తమ పార్టీలోకి ఇంకా కొంతమంది చేరబోతున్నారని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తమకు 95 నుంచి 105 స్థానాలు రావాల్సి ఉందని, అయితే పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఓటమి పాలయ్యారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీ గెలవకపోవడానికి అక్కడి నేతల మధ్య సమన్వయం లేకపోవడం, విభేదాలే కారణమని చెప్పారు. శాసనసభలో తానే సీనియర్ ఎమ్మెల్యేనని, తన తర్వాత రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారని ఆయన చెప్పారు.
గెలవని వాళ్లూ ముఖ్యమే.....
గెలిచిన వాళ్లతోనే కాకుండా గెలవని వాళ్లతో కూడా తాను మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వారి సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు. గెలవనివాళ్లు కూడా తనకు ముఖ్యమేనని తెలిపారు. కొన్ని కారణాలవ వల్లనే వారు ఓటమి పాలయ్యారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో తాను జాతీయ రాజకీయాలపైనే చర్చించానన్నారు. కాగా టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కేసీఆర్ ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ ప్రతిని పద్మాదేవేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, రెడ్యానాయక్, గొంగిడి సునీత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు అందజేశారు.