కన్నా జంప్... ఆ పార్టీలోకేనట...?
బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడే అవకాశాలున్నాయి. అనుచరులతో ఆయన సమావేశమయ్యారు
కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేత. ఆయన కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను ఏలారు. మంత్రిగా అనేక దఫాలుగా పనిచేచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాపు సామాజికవర్గం కోటాలో కన్నా లక్ష్మీనారాయణకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందన్నది వినిపించేది. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ నేతగా ఆయన ఏ పార్టీలో ఉన్నా గ్యారంటీగా ఏదో ఒక పదవి వరిస్తుందన్న నమ్మకం ఆయన అనుచరుల్లో ఉంటుంది.
సీనియర్ నేతగా...
ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన అనుకోని రీతిలో భారతీయ జనతా పార్టీలో చేరారు. తొలుత వైసీపీలో చేరాలని భావించినా చివరి నిమిషంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో అందులో చేరిపోయారు. అధ్యక్షుడిగా ఆయన ఉన్న రెండేళ్లు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. అసంతృప్తితో ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం తన ఇంటి వద్ద ఉన్న బీజేపీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అప్పుడే అనుమానం కలిగింది.
బీజేపీలో చేరినా...
అయితే ఆయన బీజేపీ అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన తర్వాత మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. బీజేపీ తనకు ఉన్నత స్థాయి అవకాశం కల్పిస్తుందని ఆశించారు. కానీ ఫలితం లేదు. రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనను పట్టించుకోవడం మానేసింది. బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తితో చాలా కాలంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు. అందులో చేరే అవకాశము లేదు. ఇక జనసేనలోకి వెళ్లడం కూడా ఆయనకు ఇష్టం లేదన్నది అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. జనసేనలోకి వెళ్లి రాజకీయంగా మరో ప్రయోగానికి సిద్ధపడినట్లేనని ఆయన భావిస్తున్నారు. జనసేన అంటే వ్యతిరేకత లేదు కాని, ఆ పార్టీలో చేరి తన సీనియారిటీని తగ్గించుకోలేనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మిగిలిన ఆప్షన్....
ఇక ఆయనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ టీడీపీ. చంద్రబాబు సీనియర్ నేత. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు మంత్రిపదవి వస్తుంది. గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావుకు తనకు మధ్య విభేదాలున్నాయి. కానీ కొంత కాలంగా చంద్రబాబు రాయపాటి కుటుంబాన్ని పక్కన పెట్టింది. అందువల్ల బీజేపీని వీడి ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయని తెలిసింది. కొద్దిసేపటి క్రితం ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఆయన జనసేనలో చేరతారా? టీడీపీ కండువా కప్పు కుంటారా? అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీని మాత్రం ఆయన త్వరలో వీడనున్నారని చెబుతున్నారు. మొత్తం మీద గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత ఏ పార్టీలోకి వెళతారన్నది ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.