రంగా కార్డు మళ్లీ బయటకు తీశారుగా...!

న్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాపు కులం ఆ సామాజికవర్గం నేతలకు గుర్తుకు వస్తుందంటారు

Update: 2022-12-17 04:30 GMT

కాపులు ఆంధ్రప్రదేశ్ లో శాసించే స్థాయిలో ఉన్నారు. అధికారంలోకి రావాలన్నది సుదీర్ఘంగా వారి కల. కానీ ఇంతవరకూ సాకారమయింది లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాపు కులం ఆ సామాజికవర్గం నేతలకు గుర్తుకు వస్తుందంటారు. మంత్రిగా ఉన్నా, మరో కీలక పదవిలో ఉన్నా కాపు కులం గురించి వారు ఆలోచించరు. అందుకే ఎన్నాళ్లుగానో రిజ్వేషన్ల సమస్య అలాగే ఉండి పోయింది. కాపు సామాజికవర్గానికి వంగవీటి రంగాను బ్రాండ్ అంబాసిడర్ ను చేశారు. ఆయనపై కాపు కులం ముద్ర వేశారు.

ఎన్నికల సమయంలోనే...
వంగవీటి రంగా బతికున్నంత కాలం ఆయన కాపుల కోసమే కాదు. పేదలు, బడుగు వర్గాల కోసం పనిచేశారు. విజయవాడ నగరంలో ఉన్న పాతతరం నేతలను ఎవరిని కదిలిచ్చినా ఈ విషయం చెబుతారు. విజయవాడకే పరిమితమయిన రంగాను రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతను చేసింది రాజకీయాలే. ఆయన మరణాన్ని మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా పార్టీలు, నేతలు వాడుకునేందుకు ప్రయత్నించడానికి ఏమాత్రం మొహమాటపడవు. రంగాకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ అలాంటిది. కాపు మీటింగ్ అంటే రంగా ఫొటో ఉండటం కామన్. ఆయనను తమ ఆరాధ్యనేతగా గుర్తిస్తారు. అదే సమయంలో ఎన్నికల సమయంలోనే ఆయన జయంతి, వర్థంతులు కూడా నేతలకు గుర్తొస్తాయన్న విమర్శలు లేకపోలేదు.

మూడేళ్లు గుర్తుకురాని...
2019లో ఎన్నికలు జరిగాయి. కానీ మొన్నటి వరకూ గుర్తుకు రాని కాపు కులం కొందరి నేతలకు 2023లో గుర్తుకు వచ్చిందంటున్నారు. అందునా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కాపు మహానాడును విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. వంగవీటి రంగా హత్యకు గురైన డిసెంబరు 26న విశాఖపట్నంలో కాపుమహానాడు నిర్వహిస్తున్నారు. 1988 డిసెంబరు 26న రంగా హత్యకు గురయ్యారు. ఆయన మరణాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంది. తర్వాత వరసగా రాజకీయ పార్టీలకు రంగా అస్త్రంగా మారారు. ఆ తర్వాత నేతలకు ఆయన వరంగా మారారని చెప్పాలి. రాధా రంగా ఆర్గనైజేషన్ పేరిట ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణల సమావేశం కూడా ఇంతేనని అంటున్నారు.

నేతల లబ్డి కోసమేనా?
అయితే కాపులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అందరికీ గుర్తుకు వస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, విడిపోయిన ఏపీలో గాని కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సీఎం కాలేకపోయారన్నది ఆ సామాజికవర్గంలో బాధ ఉండటం సహజమే. అయితే కాపు సభల కారణంగా మిగిలిన బీసీ కులాల్లో వ్యతిరేకత వస్తుందన్నది రాజకీయంగా మరో అంచనా. తాము రాజకీయంగా లబ్దిపొందడానికి, పదవులను దక్కించుకోవడానికి రంగా కార్డును బయటకు తీసుకురావడం పరిపాటిగా మారిపోయింది. రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క సామాజికవర్గంతోనే సాధ్యం కాదన్న వాదన కూడా ఉంది. అందుకే ఈ సమావేశాలన్నీ కేవలం నేతలు తాము రాజకీయంగా లబ్దిపొందడానికేనన్న విమర్శలు మాత్రం ఆ సామాజికవర్గం నుంచే వినిపస్తున్నాయి.


Tags:    

Similar News