మోడీ.. ఈడీ.. బోడీకి భయపడేది లేదు.. అవసరమైతే ఢిల్లీలో ధర్నా

మోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. అన్ని సూచీల్లో భారత స్థానం దిగజారుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు

Update: 2022-03-21 12:06 GMT

రైతుల హక్కుల రక్షణ కోసం రాజ్యాంగ హక్కులు ఉండాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై దేశమంతా ఒకే పాలసీ ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్షం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 11 లక్షల కోట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారు కాని, ధాన్యం కొనుగోళ్లకు 11 వేల కోట్లు లేవా? అని కేసీఆర్ ప్రశ్నించారు. నేషనల్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. యాసంగి వరిని పంజాబ్ లో కొనుగోలు చేసినట్లే వందశాతం కొనుగోలు చేయాలని కోరారు. ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లి మరోసారి కేంద్ర మంత్రులను కలుస్తారని కేసీఆర్ చెప్పారరు.

ప్రజలను విభజించడం కోసం...
రైతులకు జీవన్మరణ సమస్య లాంటిదన్నారు. బాయిల్డ్ రైస్ తీసుకుంటారా? రా రైస్ తీసుకుంటారా? అనేది కేంద్రం బాధ్యత అని కేసీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని కేసీఆర్ చెప్పారు. రాజకీయంగా విభజన కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. డెవెలెప్ మెంట్ ఫైల్స్ ఉండాలని కాని కాశ్మీర్ ఫైల్స్ అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సెలవులిచ్చి సినిమా చూడమంటారా? ఏం సంకేతాలిస్తున్నారని కేసీఆర్ నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పారు.
ఏ రంగంలోనూ....
మన రాజ్యాంగమే దేశ ఆహార భద్రతను కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూపీఏ కన్నా ఈ పాలన అద్వాన్నంగా ఉందన్నారు. నిరుద్యోగం హెచ్చుమీరి పోయిందన్నారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. రైతుల కోసం ఎంతటి పోరాటికైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. ఉక్రెయిన్ లో ఎంబసీని షిఫ్ట్ చేశారు కాని, విద్యార్థులను తరలించలేదని చెప్పారు. యూపీలో బీజేపీకి యాభైకి పైగా సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచించుకోవాలని కేసీఆర్ కోరారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రభుత్వం అమ్మేయాలని చూస్తుందన్నారు.
జాతీయ రాజకీయాల్లో....
మోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. అన్ని సూచీల్లో భారత స్థానం దిగజారుతుండటమే ఇందుకు నిదర్శనమని కేసీఆర్ చెప్పారు. దేశానికి బీజేపీ ఏం చేయలేదని ఎనిమిదేళ్ల పాలనలో తేలిపోయిందన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని కేసీఆర్ తెలిపారు. దేశంలో పూర్తి మార్పు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో వందకు శాతం కీలక పాత్ర తాను పోషిస్తానని చెప్పారు. యాభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, ప్రత్యామ్నాయ రాజకీయశక్తి వస్తుందని కేసీఆర్ తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడబోనని చెప్పారు. ఈడీ దాడులు తమనేమీ చేయలేవని, అలాగైతే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం చేసే వాడిని కాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రశాంత్ కిషోర్ తమతో కలసి పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. ఇందులో రహస్యమేమీ లేదన్నారు. ఆయన పెయిడ్ వర్కర్ కాదన్నారు. దేశ హితం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఏడుఎనిమిదేళ్లుగా తనకు పీకేతో స్నేహితం ఉందని చెప్పారు. 


Tags:    

Similar News