దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్

2024 లో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

Update: 2022-09-05 12:44 GMT

2024 లో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశంలో 2024 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ముక్త్ బీజేపీ నినాదంతో నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయాల్లోకి వెళతామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ లో కలెక్టరేట్ సముదాయన్ని ప్రారంభించిన కేసీఆర్ అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ ఉచిత పథకాలను పేదలకు పంచవద్దని చెబుతుందన్నారు. రైతులకు ఉచితాలు ఇవ్వవద్దని కూడా మోదీ ప్రభుత్వం చెబుతుందన్నారు. బావి కాడ మీటర్లు పెట్టమనే మోదీ సర్కార్ ను తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ మాదిరిగానే...
తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామో ప్రజలు అందరూ గమనించాలని కోరారు. దేశం మొత్తం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుందన్నారు ఇక్కడ అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆయన తెలిపారు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని చెప్పారు. తెలంగాణను ఏవిధంగా బాగు చేసుకున్నామో అలాగే దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఉన్న వాటిని అమ్మేస్తూ...
నరేంద్ర మోదీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. ఉన్నవి అమ్ముకుంటున్నారన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిందేనని అన్నారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లోకి నిజామాబాద్ గడ్డపై నుంచే వెళతామని ఆయన ప్రకటించారు. ఈ దేశాన్ని కాపాడుకోవటం కోసం తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే దేశంలో ఉండే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News