దొరవారికి తత్వం బోధపడింది!

‘భారతీయ జనతా పార్టీ పాలన ఇక దేశానికి మంచిది కాదు. కేంద్ర స్థాయిలో నేనే రంగంలోకి దిగుతా. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకువస్తా, ఢల్లీిని గాయిగత్తర చేస్తా’

Update: 2023-06-24 07:16 GMT

బీజేపీతో కేసీఆర్‌ ‘సాఫ్ట్‌’ పాలిటిక్స్‌

అమిత్‌ షా మీటింగ్‌కి వినోద్‌ కుమార్‌

కేంద్ర మంత్రులతో కేటీఆర్‌ ములాఖత్‌

ప్రతిపక్ష పార్టీల మీటింగ్‌కి బీయారెస్‌ డుమ్మా

‘భారతీయ జనతా పార్టీ పాలన ఇక దేశానికి మంచిది కాదు. కేంద్ర స్థాయిలో నేనే రంగంలోకి దిగుతా. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకువస్తా, ఢిల్లీని గాయిగత్తర చేస్తా’ కొన్నాళ్ల కిందటి వరకూ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌ హూంకరింపులు ఇవి. పార్టీ పేరుని మార్చగానే కర్నాటకలో కుమార్‌స్వామి, ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ వంటి యోధులను కలిశారు. తెలంగాణ సాధించినట్లుగానే కేంద్రంలో పవర్‌ కూడా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ తమకు సమాన దూరమేనని, మూడో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తామని కేసీఆర్‌ ఘంటాపథంగా చెప్పారు.

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. ఆప్‌ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జైలులోకి వెళ్లిపోయారు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత పేరు కూడా ఛార్జిషీట్‌లోకి ఎక్కింది. ఆమె సీబీఐ గడప తొక్కి, గంటల కొద్దీ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఏ క్షణమైనా కవిత అరెస్ట్‌ అంటూ మీడియా చాలా టెన్షన్‌ పడిపోయింది. కానీ కవిత అరెస్ట్‌ కాలేదు. లిక్కర్‌ కుంభకోణంలో సీబీఐ కూడా దూకుడు తగ్గించేసింది.

ఒక్కసారిగా కేసీఆర్‌కి మోదీలో మంచి స్నేహితుడు కనిపించాడు. మెరుగైన పాలన ఇవ్వాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు ఆలోచనలు పంచుకుంటామని చెప్పడంతో, ఆయన గాయిగత్తర చేస్తే బ్రేకింగ్‌ న్యూస్‌ ఇద్దామనుకున్న మీడియా ఖంగు తింది. సారు చేసే ప్రతీ పని వెనుక లోక కల్యాణం ఉంటుంది కాబట్టి ప్రసార సాధనాల సోదరులు మౌనాన్ని ఆశ్రయించారు.

బీజేపీని ఓడించాలనే లక్ష్యంగా శుక్రవారం పట్నాలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్‌ జరిగింది. ఆ మీటింగ్‌కి ఎలాగూ జగన్‌, చంద్రబాబు హాజరు కారు. అది జగమెరిగిన సత్యం. కేసీఆర్‌ కూడా హాజరు కాకపోవడంపై కాంగ్రెస్‌ మండి పడుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో మణిపూర్‌పై జరిగిన అఖిల పక్ష సమావేశానికి కేసీయార్‌ తన సన్నిహితుడు బి.వినోద్‌ కుమార్‌ను పంపించి, బీజేపీకి స్నేహ హస్తం జాచారు. ఇదే సమయానికి కేటీ రామారావు ఢల్లీిలో కేంద్రమంత్రులను కలిసి, రాష్ట్రానికి అందాల్సిన సహాయ సహకారాల గురించి చర్చించారు. ఈ సమావేశాలు కూడా చాలా ‘సానుకూల’ వాతావరణంలో జరిగాయి.

అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ గోల మొదలు పెట్టింది. కమలం, గులాబీ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, ఆ రెండూ ఒకటేనని కాంగ్రెస్‌ నాయకుడు మాణిక్‌రావ్‌ ఠాక్రే కుండ బద్దలు కొట్టారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, తాము అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

తెలంగాణ సర్కార్‌ మీద అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ నేత బండి సంజయ్‌ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. కేంద్ర స్థాయిలో భుజాలు రాసుకుని తిరిగి, రాష్ట్ర స్థాయిలో పోరాడటం సులువు కాదని ఆయనకు తెలుసు. కేటీయార్‌ని అమిత్‌షా వద్దకు పంపి కేసీఆర్‌ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయేలా చూస్తున్నారని సంజయ్‌ ఆరోపిస్తున్నారు. మరి ఈయన వెళ్తే ఆయన ఎలా ఆహ్వానిస్తున్నాడో సంజయ్‌ తన బాస్‌ని అడిగి తెలుసుకోవాలి. త్రిముఖ పోటీ జరుగుతుందని భావిస్తున్న తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల వేళకి గానీ అసలు వ్యూహాలు బయటకు రావు.

కొసమెరుపు ఏంటంటే ` కేసీయార్‌ తన పార్టీపేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంపై మీడియా మిత్రులు చంద్రబాబును కామెంట్‌ చేయమన్నారు. దానికి చంద్రబాబు ఓ విచిత్రమైన నవ్వు నవ్వారు. ఆ నవ్వుకి అర్థం కేసీఆర్‌కి ఇప్పుడు తెలిసి ఉంటుంది. 

Tags:    

Similar News