కిల్లిని అందుకే ఆపారా?
కిల్లి కృపారాణి వైసీపీలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు పొందలేదు. తనకు రాజ్యసభ పదవి వస్తుందని ఆశించినా అడియాసగానే మారింది
కిల్లి కృపారాణి వైసీపీలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు పొందలేదు. తనకు రాజ్యసభ పదవి వస్తుందని ఆశించినా అడియాసగానే మారింది. కొంతకాలం క్రితం భర్తీ చేసిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఖచ్చితంగా కిల్లి కృపారాణికి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ కిల్లిని పక్కన పెట్టారు. అందుకు ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కింజారపు కుటుంబాన్ని ఢీకొట్టేందుకు కిల్లి కృపారాణిని జగన్ వినియోగిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే ఆమెకు ఇప్పటి వరకూ ఎలాంటి పదవులు ఇవ్వకుండా దూరంగా పెట్టారన్నది ఆమె సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు....
కిల్లి కృపారాణి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె నేరుగా వైసీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజికవర్గానికి చెందిన నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా, వైద్యురాలిగా మంచిపేరే ఉంది. దీంతో పార్టీలో చేరినా జగన్ 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. దువ్వాడ శ్రీనివాస్ కు ఇచ్చారు. దువ్వాడ కూడా కింజారపు రామ్మోహన్ నాయుడును ఓడించలేకపోయారు. కింజారపు కుటుంబం శ్రీకాకుళం పార్లమెంటు స్థానంపై పట్టు ఉంది. 1996 నుంచి 2009 వరకూ ఎర్రనాయుడు ఎంపీగా ఉన్నారు.
కింజారపు కుటుంబాన్ని...
ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్థి అయి వరసగా రెండుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. కింజారపు కుటుంబాన్ని దెబ్బకొట్టాలంటే కిల్లి కృపారాణి వల్లనే సాధ్యమవుతుందని జగన్ లెక్కలు వేస్తున్నారు. 2009 ఎన్నికల్లో కిల్లి కృపారాణి ఎర్రన్నాయుడును ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కిల్లి కృపారాణి 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు. కానీ బీసీ కోటా కింద కూడా ఆమెకు ఇప్పటి వరకూ ఎటువంటి పదవులు లభించలేదు.
దువ్వాడకు ఎమ్మెల్సీగా...
ఇప్పటికే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో కిల్లి కృపారాణి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జురుగుతుంది. సర్వేల్లో కూడా ఆమె వైపు మొగ్గు చూపుతుండటంతో ఆమెనే అభ్యర్థిగా జగన్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఏ పదవి ఇవ్వకుండా కిల్లిని జగన్ దూరం పెట్టారంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతు పెంచుకోవాలని కూడా జగన్ ఆమెకు సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద కిల్లి కృపారాణి వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖాయమంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.