కోడెల జంప్‌కు రెడీ అయ్యారా?
కోడెల కుటుంబం టీడీపీ అధినాయకత్వంపై మండిపడుతుంది. శివరాం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు
కోడెల శివప్రసాదరావు బతికున్నంత వరకూ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కోడెలను కాదని పదవులు పక్కకు పోయేవి కావు. ఇక గుంటూరు జిల్లాలో అయితే కోడెల చెప్పిందే వేదం. ఆయన ఊ అంటేనే చంద్రబాబు ఓకే అంటారు. లేదంటే ఎంతటి నేతనైనా పార్టీలో చేర్చుకునేది ఉండదు. పదవులు ఇచ్చేది అస్సలు ఉండదు. కోడెల శివప్రసాదరావును సాక్షాత్తూ చంద్రబాబు పల్నాడు పులిగా పిలిచే వారు. అలాంటి కోడెల శివప్రసాదరావు ఊహించని రీతిలో మరణించారు. పల్నాడులో పార్టీకి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏదైనా కావచ్చు. కానీ ప్రభుత్వ వేధింపులేనంటూ అప్పట్లో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పదే పదే విమర్శలు సంధించేవారు.
నాలుగేళ్ల నుంచి...
అయితే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని మాత్రం ఆయన మరణం తర్వాత పార్టీ దూరం పెడుతూ వస్తుంది. చివరకు సత్తెనపల్లి టిక్కెట్‌ను కూడా ఇవ్వనని చెప్పకనే చెప్పింది. కోడెల వారసుడిగా ఆయన కుమారుడు శివరామ్ గత కొద్ది రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు అక్కడి నుంచే గెలవడం, అది ఆయన సొంత గ్రామమున్న నియోజకవర్గం కావడంతో నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి షిఫ్ట్ చేశారు. ఒకరకంగా అయిష్టంగానే కోడెల సత్తెనపల్లికి వచ్చారంటారు. డాక్టర్‌గా కూడా నరసరావుపేటలో మంచిపేరున్న కోడెలను కొన్ని సమీకరణాల నేపథ్యంలో 2014లో సత్తెనపల్లికి పంపారు.
మూడు గ్రూపులు...
2014లో గెలిచిన కోడెల శివప్రసాదరావు 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే వారసుల వల్ల కోడెలకు చెడ్డపేరు వచ్చిందంటారు. ప్రత్యేకంగా తమకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుని వారికే లబ్ది చేకూర్చడం, చిన్న చిన్న పనులలో కమీషన్లకు కక్కుర్తి పడ్డారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీంతో కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పదవిని చంద్రబాబు ఎవరికీ ఇవ్వలేదు. సత్తెనపల్లిలో పోటీ చేయడానికి కోడెల శివరాంతో పాటు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సయితం పోటీ పడ్డారు. వీరు కాకుండా మూడో గ్రూపు కూడా అక్కడ తయారు కావడంతో చంద్రబాబుకు మరింత తలనొప్పిగా తయారైంది. నాలుగేళ్లు సత్తెనపల్లి ఇన్‌ఛార్జి విషయంలో నాన్చిన చంద్రబాబు చివరకు కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నేరుగానే విమర్శలు...
దీంతో కోడెల కుటుంబం టీడీపీ అధినాయకత్వంపై మండిపడుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమ కుటుంబాన్ని కాదని నిన్న గాక మొన్న పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు ఎలా ఇస్తారని శివరాం ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబానికి పార్టీ అన్యాయం చేసిందని ఆయన బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని హెచ్చరికలు కూడా పంపుతున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం కోడెల శివరాంను నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కన్నాకు సహకరించాలని కోరుతుంది. అయితే తమ కుటుంబాన్ని దెబ్బతీసిన పార్టీని తాము కూడా గట్టి దెబ్బ కొట్టాలని కోడెల శివరాం భావిస్తున్నట్లు సమాచారం. ఆయన తన వర్గీయులతో సమావేశమై సమాలోచనలు జరుపుతున్నారు. అవసరమైతే వైసీపీలో చేరేందుకు కూడా తాము సిద్ధమన్న సంకేతాలను కోడెల శివరాం త్వరలో పంపనున్నట్లు తెలిసింది. దీంతో కోడెల కుటుంబం, ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఎటు వైపు వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది.