తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... మర్రి జనార్ధన్ రెడ్డి తనకు మిత్రుడేనని పేర్కొన్నారు. తాను ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందని అడిగానని, తమ వద్ద పరిస్థితిని చెప్పానని తెలిపారు.
ఆయనే ఫోన్ చేసి.....
ఫోన్ పెట్టేశాక కొంతసేపటికి ఆయనే తనకు ఫోన్ చేశారని, మళ్లీ రాజకీయ పరిస్థితులు, గెలుపోటములే మాట్లాడామని, ఆ సమయంలో మర్రి జనార్ధన్ రెడ్డి రికార్డు చేశారని పేర్కొన్నారు. తానేమి మాట్లాడానో రికార్డు బయటపెట్టాలని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తిపరుడైన మర్రి జనార్ధన్ రెడ్డిని కొనడం సాధ్యమా అని ప్రశ్నించారు. కొనడంలో టీఆర్ఎస్ నేతలే నిపుణులని, 63 మంది ఉన్న ఎమ్మెల్యేలు 90కి ఎలా పెరిగారని ప్రశ్నించారు. మీడియా ముందే మర్రి జనార్ధన్ రెడ్డికి ఫోన్ చేయగా... ఆయన లిఫ్ట్ చేయలేదు. జనార్ధన్ రెడ్డి తన మిత్రుడైనందున మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నానని, మళ్లీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తామని పేర్కొన్నారు.