బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
శ్రీలంక తీరానికి చేరువగా ఈనెల 9న ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 48 గంటల్లో ఇది బలపడే అవకాశం..
నైరుతి బంగాళాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. శ్రీలంక తీరానికి చేరువగా ఈనెల 9న ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 48 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ నుంచి తూర్పు గాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. సోమవారం నాటికి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశమున్నట్లు అధికారులు వివరించారు. కాగా.. ఏపీ, తెలంగాణల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా మన్యం, పాడేరు ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.