జనవరి 3, 2011. రాయలసీమలో సుదీర్ఘకాలం పాటు సాగిన రక్తచరిత్ర హైదరాబాద్ లో ముగిసింది. దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ నడిపిన మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యారు. అనుచరుడు భానుకిరణే నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పనుంది. భానుకి శిక్ష పడుతుందా..? లేదా నిర్దోషిగా విడుదల అవుతాడా అనేది ఇప్పుడు ఉత్కంఠకు గురిచేస్తుంది. ఇప్పటికే సీఐడీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ ధాఖాలు చేయడంతో పాటు ప్రధాన నిందితుడిగా ఉన్న భాను కిరణ్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు నాంపల్లి కోర్టులో ట్రయల్స్ కొనసాగుతున్న సమయంలోనే సీఐడీ పోలీసులు సాక్షాలు సేకరించడంతో పాటు ప్రత్యక్ష సాక్షి అయిన సూరి డ్రైవర్ వాగ్మూలాన్ని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టును సీఐడీ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
డ్రైవర్ మధు వాంగ్మూలం...
సీఐడీకి డ్రైవర్ మధు ఇచ్చిన వాగ్మూలంలో ప్రధాన అంశాలు పరిశీలిస్తే... జూబ్లీహిల్స్ నుండి సనత్ నగర్ బయలుదేరి ఒక న్యాయవాది ని కలిసామని, అక్కడి నుంచి స్కోడా కారులో తాను, సూరి, భాను ఓకే కారులో బయలుదేరామని తెలిపాడు. ముందు సీట్లో సూరి, వెనుక సీట్లో భాను కూర్చున్నారన్నారు. నవోదయ కాలనీకి చేరుకుంటున్న సమయంలో అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో కారును స్లో చేశానని.. అంతలోనే కారులో ఒక పెద్ద శబ్దం రావడం... తన ప్రక్కన ఉన్న సూరి సిగరెట్ త్రాగుతూ తన భుజం పై ఓరిగాడని చెప్పాడు. కారులో ఉన్న భాను అటాక్ అటాక్ అని అరుస్తూ కారు దిగి అక్కడి నుండి వెళ్లి పోయాడని తెలిపాడు. వెంటనే సూరిని అపోలో హస్పిటల్ కు తరలించానన్నాడు. ఆ తర్వాత భానుకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదని వాంగ్మూలం ఇచ్చాడు.
సాక్షాలు సరిపోతాయా..?
మరో ప్రక్క ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టులో పాయింట్ బ్లాంక్ లోనే సూరిపై కాల్పులు జరిగాయని తేలిందని సీఐడీ పోలీసులు తెలిపారు. పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపే అవకాశం ఒక్క భానుకు మాత్రమే ఉందన్నారు సీఐడీ పోలీసులు. ప్రత్యక్ష సాక్షి మధు హత్య ఎవరు చేశారో స్పష్టంగా చెప్పకపోవడం, హత్యకు ఉపయోగించిన వెపన్ రెండు సంవత్సరాల తర్వాత పోలీసులకు దొరకడంతో వేలిముద్రలు మాయం కావడం, హత్యకు సహకరించినట్టుగా భానును తప్ప ఏ ఒక్కరినీ ఆధారాలతో బోనులో నిలబెట్టలేకపోవటంతో కేసు ఏమవుతుందో అర్థం కావడం లేదు. కేవలం ఫోరెన్సిక్ రిపోర్టుతో మాత్రమే భానుకిరణ్ హత్య చేశాడని కోర్టు పరిగణిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ప్రధాన నిందితుడు భానుకిరణ్... సూరి హత్య తర్వాత ఇప్పటివరకు బెయిల్ కోసం అప్పీల్ కూడా చెయ్యకుండా జైల్లోనే గడపటం విశేషం. సూరి కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకోంది.