నేరస్థుడితో కలసి సీఎం విందు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్్సింగ్ చౌహాన్ వివాదంలో చిక్కుకున్నారు.దొంగతో కూర్చుని ఆయన విందు చేయడం హాట్ టాపిక్ అయింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్్సింగ్ చౌహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక దొంగతో కూర్చుని ఆయన విందు చేయడం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి పక్కనే ఒక దొంగకు చోటు కల్పించడంపై భద్రతా వైఫల్యాన్ని కూడా పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా దొంగ వీపును శివరాజ్్సింగ్ చౌహాన్ తట్టడం కూడా వీడియోలో కనిపిస్తుండటంతో అమాయకపు సీఎం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అరవింద్ గుప్తా అనే యువకుడు కలప దొంగతనం కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చారు.
భద్రతా వైఫల్యం...
సిద్ధి జిల్లాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్్సింగ్ చౌహాన్ పర్యటనలో ఈ ఘటన చోటు చేేసుకుంది. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్్సింగ్ చౌహాన్ ప్రజలతో కలసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి పక్కన అరవింద్ గుప్తా కూర్చోవడాన్ని ఎవరూ గమనించలేదు. భద్రతా సిబ్బంది కూడా పట్టించుకోలేదు. ఇది భద్రతా వైఫల్యమేనని ఉన్నతాధికారులు కూడా దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కొందరు అధికారులు సస్పెండ్ కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.