ఖర్గే లక్ ఎలా ఉందో?
ఏఐసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే తొలిసారిగా తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 115 సీట్లు మ్యాజిక్ ఫిగర్. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కన్నడ ప్రజలు ఇచ్చే తీర్పుపై దేశ మంతా ఆసక్తితో ఎదురు చూస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టున్న ప్రాంతం కర్ణాటక కావడంతో ఈ ఎన్నికలపై బీజేపీ ఎంతో హోప్స్ పెట్టుకుంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. కాంగ్రెస్‌ను ఈ రాష్ట్రంలో ఆషామాషీగా తీసిపారేయడానికి లేదు. ఆ పార్టీకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది.
సమర్ధమైన నాయకత్వం...
సమర్ధమైన నాయకత్వం కూడా ఆ పార్టీకి ఉంది. సరే అన్ని రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలోనూ ఇక్కడ గ్రూపులున్నప్పటికీ ఎన్నికల నాటికి అంతా సద్దుమణగడం కొంత అనుకూలించే అంశం. కాకుంటే ఎన్నికల సమయంలో మ్యానిఫేస్టోలో రూపొందించిన కొన్ని అంశాలు బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయింది. ప్రధానంగా ఏమాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంచేసినా భజరంగదళ్ ను నిషేధిస్తామని చెప్పడం బీజేపీకి రేపటి ఎన్నికల్లో కలసి వస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ఈ అంశాన్ని బీజేపీ పెద్దది చేసి చూపించే ప్రయత్నం చేసినా ప్రజలు ఏ మేరకు మొగ్గుచూపుతారన్నది ఇంకా తేలాల్సిన విషయం. కాంగ్రెస్ కూడా ప్రతి గ్రామంలో హనుమాన్ గుడి కట్టిస్తామని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత...
మరోవైపు ఏఐసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే తొలిసారిగా తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటం విశేషం. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత కర్ణాటక ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. అందుకే ఆయన ఈ ఎన్నికను స్వయంగా దగ్గరుండ పర్యవేక్షించారని చెప్పాలి. అందరినీ ఏకతాటి పైకితేవడంతో పాటు నమ్మకమైన వారికే సీట్లు ఇవ్వడంలో కూడా ఖర్గే కీలక పాత్ర పోషించారంటున్నారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు కావడంతో ఎన్నికల్లో గెలుపోటములకు ఆయవన కూడా కొంత బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. మ్యానిఫేస్టో నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ ఆయన దగ్గరుండి చూశారు.
అందుకే ఎంపిక...
అందుకే కర్ణాటక ఎన్నికలు బీజేపీకి దక్షిణాదిన ఎంత ముఖ్యమో ఏఐసీసీ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా ఖర్గేకు కూడా అంత ముఖ్యమే. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయనను ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖర్గే నియామకంతో కన్నడ రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ వైపు ఉంటుందని పార్టీ హైకమాండ్ కూడా భావించి ఉండవచ్చు. మరి ఈ నెల 13వ తేదీన జరిగే కౌంటింగ్ లో ఈ విషయం తేలుతుంది. రాజస్థాన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొలుత అశోక్ గెహ్లాత్ అనుకున్నా ఆయన కాదనడంతో చివరకు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. మరి ఖర్గే ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఎంత మేర పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది.