మల్లు బ్రదర్స్... పాలిటిక్స్ అదుర్స్

మల్లు కుటుంబం అంటేనే కాంగ్రెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇద్దరూ చెరో జిల్లాలో రాజకీయం చేస్తూ వచ్చారు

Update: 2022-12-18 08:11 GMT

మల్లు రవి.. మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు సోదరులే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మల్లు రవి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్కలు రాజకీయం చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా వెలిగిన కుటుంబం కావడం, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉండటంతో అనేక పదవులు దక్కాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మల్లు కుటుంబం పేరు ప్రతిష్టలను ఇద్దరూ ఇనుమడింప చేశారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మరో సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు.

కాంగ్రెస్ కు ...
మల్లు కుటుంబం అంటేనే కాంగ్రెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇద్దరూ చెరో జిల్లాలో రాజకీయం చేస్తూ వచ్చారు. ఇద్దరూ ఎవరికి వారే తమ రాజకీయ భవిష్యత్ ను నిర్దేశించుకుంటారు. అలాంటి మల్లు సోదరులు ఇప్పుడు చెరో వర్గంగా విడిపోయారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఎన్నికయిన నాటి నుంచి మల్లు రవి రేవంత్ ప్రధాన అనుచరుల్లో ఒకరిగా మారారు. రేవంత్ ను వెనకేసుకు వచ్చే వారిలో మల్లు రవి ముందుంటారు. ఒకరకంగా చెప్పాలంటే రేవంత్ కూడా మల్లురవిని ముందుంచి ఆయన నడిపిస్తుంటాడని పార్టీ వర్గాలు చెబుతుంటాయి.

మృదుస్వభావిగా...
మల్లు భట్టి విక్రమార్క 2018లో గెెలిచిన తర్వాత సీఎల్పీ నేత అయ్యారు. ఆయన ప్రతిపక్ష నేతగా పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలకు అనుగుణంగా ఆయన నడుచుకుంటారు. సామాజికవర్గం కూడా కలసి రావడంతో ఆయనకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవులు గ్యారంటీ అన్న టాక్ పార్టీలో ఉంటుంది. మధిర నియోజకవర్గంలోనూ అందరినీ కలుపుకుని వెళతారు. మృదుస్వభావిగా పేరుంది. వివాదాస్పదమైన వ్యక్తి కాదు. మొన్నటి వరకూ మల్లు భట్టి విక్రమార్క కూడా రేవంత్ కు అనుకూలంగానే ఉండేవారు. పార్టీ ఇబ్బందులు పడకుండా ఆయన విమర్శలకు దూరంగా ఉండేవారు.

ఇద్దరిదీ చెరో వర్గం...
అలాంటి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లోనే అసంతృప్త సీనియర్ నేతల సమావేశం జరగడం విశేషం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భట్టి ఇంట్లోనే మీటింగ్ జరిగింది. తమ గళం విప్పారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మల్లు రవి మాత్రం రేవంత్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు తెలియకుండానే కమిటీల నియామకం జరిగిందని మల్లు భట్టి విక్రమార్క అంటుంటే.. అంతా సక్రమంగానే జరిగిందని, సామాజిక న్యాయం పాటించారని మల్లు రవి అంటున్నారు. సీనియర్ నేతల సమావేశంపై మల్లు రవి మండి పడ్డారు. ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడు ఒకే పార్టీలో చెరొక వర్గంగా మారిపోవడం విశేషం.


Tags:    

Similar News