మరాఠీనేత ఏం మాయ చేస్తారో?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికరావ్ థాక్రే నియమితులయ్యారు. ఆయన ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు;
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికరావ్ థాక్రే నియమితులయ్యారు. ఆయన ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణలో గుర్రుగా ఉన్న సీనియర్ నేతలను ఆయన ఎలా లైన్ లో పెడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆయన హైదరాబాద్ కు వచ్చే ముందే పాత ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ తో మాట్లాడి తెలంగాణలోని పార్టీ పరిస్థితులపై లోతుగా తెలుసుకున్నారని సమాచారం. అలాగే తెలంగాణతో పరిచయమున్న సీనియర్ నేతలతోనూ ఆయన టచ్ లోకి వెళ్లి ఇక్కడ లోతుపాతుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.
వచ్చే ముందే...
దీంతో ఆయన తెలంగాణకు వచ్చే ముందే పూర్తిగా ప్రిపేర్ అయి వస్తున్నారన్నది అర్థమవుతుంది. ఇక్కడ రామా అన్నా బూతుగా మార్చే నేతలు ఉన్నారన్న విషయాన్ని ఆయన గ్రహించినట్లున్నారు. అందుకే వచ్చీ రాగానే వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సీనియర్ నేతలు ఒక్కొక్కరితో సమావేశమయిన తర్వాత సాయంత్రం రాజకీయ వ్యవహారాల కమిటీతో ఆయన సమావేశం కానున్నారని చెబుతున్నారు. సీనియర్ నేతల ఒపీనియన్ ను విడివిడిగా తీసుకున్న తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఒక వ్యూహాన్ని రూపొందించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు.
ఏకతాటిపైకి తీసుకురావడమే...
అయితే మాణిక్‌రావ్ థాక్రే ముందున్న లక్ష్యం అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడమే. అది ఆయనకు అది పెద్ద సవాల్ అని చెప్పకతప్పదు. ఎవరికి వారు పదవుల కోసం పాకులాడుతుండటంతో ఒక స్పష్టమైన సంకేతాలను ఆయన ముందు అందరు నేతలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం కొంచెం లూజ్ ఇచ్చినా వారు నెత్తిన ఎక్కే ప్రమాదం లేకపోలేదని ఇప్పటికే ఆయనకు దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు చెప్పినట్లు తెలిసింది. ముందుగా మంచిగానే పార్టీ పరిస్థితులు, దానిని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై అందరి నుంచి సలహాల తీసుకుని వారి సూచనలకు అనుగుణంగానే నడుచుకుంటారని చెబుతున్నారు.
గాడిలో పెట్టాలంటే...
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై కూడా ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఐదు నెలలకు పైగా యాత్ర కావడంతో ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. థాక్రే నుంచి ఎలాంటి సమాచారం ఏఐసీసీ పంపిందన్నది తెలియలేదు. ఆయన ఓకే అంటేనే రేవంత్ పాదయాత్ర జరుగుతుంది. లేదంటే లేదు. అందుకే సీనియర్ నేతలు కూడా యాత్రపై ఆయన ఎలాంటి నిర్ణయం వెలువరుస్తారన్న ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ముందుగా పార్టీని గాడిన పెట్టిన తర్వాతనే కార్యాచరణను మాణిక్‌రావు థాక్రే రూపొందించాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ మరాఠీ నేత ఏం మాయ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది.