గవర్నర్ గిరీ కోసమేనా?
మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు ప్రధాన కారణమయింది
మర్రి శశిధర్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు. 67 సంవత్సరాల వయసు. అంటే దాదాపు ఏడు పదుల వయసులో ఆయన పార్టీ మారుతున్నారు. శశిధర్ రెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1992లో ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఆయన చివరి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఇంటిని గెలుపు పిలుపు పలకరించలేదు.
కాంగ్రెస్ లో పదవులు....
అలాంటి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి కేంద్రంలో కేబినెట్ పదవిని కేటాయించింది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్ గా నియమించింది. దాదాపు పదేళ్ల పాటు ఆ పదవిలో శశిధర్ రెడ్డి కొనసాగారు. అనంతరం 2014లో ఆయన పోటీ చేసినా గెలవలేకపోయారు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ లో కీలక భూమికనే పోషిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తనయుడిగా పార్టీలో ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది.
కొంతకాలంగా అసంతృప్తి...
అలాంటి మర్రి శశిధర్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ వయసులో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా స్థానిక నాయకత్వంపై అసంతృప్తి ఆయనను కమలం పార్టీ వైపు అడుగులు వేయించే దిశగా చేసింది. ఇటీవల ఆయన పీసీసీ పై బహిరంగ విమర్శలే చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా మర్రి శశిధర్ రెడ్డి దూరంగానే ఉన్నారు. తన తండ్రిని, తనను వివిధ పదవులతో ఆదరించిన కాంగ్రెస్ ను వీడేందుకు శశిధర్ రెడ్డి సిద్ధమయ్యారు.
ఆ హామీతోనే...
నిన్న రాత్రి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఈ చర్చకు ప్రధాన కారణమయింది. ఏడు పదులు దాటితే బీజేపీలో ఎలాంటి పదవులు ఉండవు. అయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో, అక్కసుతో పార్టీని వీడాలని మర్రి శశిధర్ రెడ్డి ప్రయత్నించడం కొంత విమర్శలకు దారి తీసింది. కాంగ్రెస్ లో ఉండి యువనేతలకు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితుల్లో కమలం పార్టీలోకి వెళ్లి ఆయన ఏం చేస్తారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలో చేరితే ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందన్న హామీతోనే చేరుతున్నట్లు చెబుతున్నారు.