దాడులు చేసేస్తారా….?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారిస్తుంటే… తెలంగాణలో దాడులు చేసేందుకు మావోయిస్టులు రెడీ అవుతున్నారు. గోదావరి దాటేందుకు యత్నిస్తున్నారు. నెల్లిపాకలో మావోయిస్టుల బ్యానర్లు… [more]

Update: 2019-01-28 02:35 GMT

రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారిస్తుంటే… తెలంగాణలో దాడులు చేసేందుకు మావోయిస్టులు రెడీ అవుతున్నారు. గోదావరి దాటేందుకు యత్నిస్తున్నారు. నెల్లిపాకలో మావోయిస్టుల బ్యానర్లు… 31న బంద్‌కి పిలుపు ఇవ్వడం… అన్నీ మావోయిస్టుల రాకను సూచిస్తున్నాయి.

కొత్త క్యాడర్ రిక్రూట్ మెంట్…..

ఏడాది కిందటి వరకూ తెలంగాణలో ముఖ్యంగా గోదావరి అవతల భద్రాచలం, భూపాలపల్లి డివిజన్లకే పరిమితమైన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు గోదావరి ఇవతల మణుగూరు సబ్‌ డివిజన్‌లో మొదలయ్యాయి. ఏడాది కిందట మావోయిస్టులు పినపాక మండలం భూపతిరావు పేటలో వాహనాల్ని తగలబెట్టి… పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ జోగయ్యను చంపేశారు. ఇప్పుడు అశ్వాపురం మండలం మొండికుంట, నెల్లిపాక గ్రామాల మధ్య బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్‌ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తున్నారు. గతేడాది సుజాత కార్యదర్శిగా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీని మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. గోదావరి ఇవతల మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ విస్తరణ కార్యక్రమాలు జరిగాయి. పాల్వంచ కేంద్రంగా కొత్త క్యాడర్‌ రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. 3 నెలల కిందట సుజాతను పోలీసులు పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో కార్యకలాపాలకు చెక్‌ పడిందని అనుకంటే… అశ్వాపురం మండలంలో ఫ్లెక్సీలు కనిపించడంతో మళ్లీ మావోయిస్టులపై చర్చ మొదలైంది.

గిరిజనుల మద్దతుతో….

పోలీసులు, గ్రీన్‌‌హంట్‌ దళాలు, కేంద్ర బలగాలూ పనిచేస్తున్నా భద్రాచలం డివిజన్‌, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోల కార్యకలాపాలు ఆగట్లేదు. ప్రెషర్‌ బాంబులు పేల్చడం, వాహనాల్ని తగలబెట్టడం, ఇన్ఫార్మర్ల పేరుతో జనాన్ని చంపడం వంటివి చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌‌లో వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ తన బలగాల్ని పెద్ద సంఖ్యలో కోల్పోయింది. 2017 మే నుంచీ 2018 డిసెంబరు వరకు 196 మందినీ, 95 మంది సానుభూతిపరులను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా దండకారణ్యంపై పోలీసులు పైచేయి సాధించలేకపోయారు. గిరిజనుల మద్దతు మావోలకే లభిస్తోంది.

రిక్రూట్ మెంట్ స్టార్ట్ చేసి…..

2017లో గ్రీన్‌‌హంట్‌తోపాటు ఆపరేషన్ సమాధాన్‌ పేరుతో తీవ్రవాద కార్యకలాపాల అణచివేతకు కేంద్రం ఒక వ్యూహాం రచించింది. ఇందుకోసం ఐదున్నర లక్షల మంది పారా మిలిటరీ కమాండో బలగాల్ని కేటాయించింది. అయినా ఫలితం లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా దళాలకు కొత్తగా శారదను కార్యదర్శిగా నియమించారు. ఆమె అధ్వర్యంలో ఆపరేషన్‌ సమాధాన్‌‌కు వ్యతిరేకంగా వారం పాటు ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించాలని ఈనెల 31న బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మణుగూరులో మావోయిస్టుల బంద్‌ పిలుపు ఫ్లెక్సీలు వెలిశాయి.ప్రధానంగా అశ్వారావుపేట, మణుగూరు బీటీపీఎస్‌లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మణుగూరులో పనిచేస్తున్న రెండు యాక్షన్‌ టీంల వల్ల ముప్పు ఉందన్న ప్రచారం జరుగుతోంది. అర్బన్‌ ప్రాంతంలో మావోయిస్టు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. నిరుద్యోగ యువతను ఆకర్షించేలా కొందరు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారిని ఛత్తీస్‌గఢ్‌లో అడవికి ట్రైనింగ్ కోసం పంపుతున్నారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News