Summer Effect : నిప్పుల పైన నడుస్తున్నట్లుందిగా... ఇదేమి సన్ స్ట్రోక్ రా బాబూ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మార్చి నెలలో మాడు పగిలిపోయేలా ఎండలు కాస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో పాటు వేడిగాలులు ఇంట్లో కూర్చున్న మనుషులను కూడా ఉడికించేస్తున్నాయి. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడి భగభగలతో చురుక్కుమనే వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.
42 డిగ్రీలు నమోదు కావడంతో...
కొన్ని చోట్ల ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నెలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే ప్రధమమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేయడంతో పరిస్థితి తీవ్రత మరింత ఎక్కువయిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎండల దెబ్బకు వృద్ధులు, చిన్నారుల, దీర్ఘకాలిక రోగులు, గుండె సంబంధిత సమస్యలున్న వారు రావద్దని, వీలయినంత వరకూ ఇంట్లోనే ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
రికార్డు స్థాయిలో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రయాణాలు కూడా మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు.