ఈ పెద్దోళ్లున్నారే... ఎదగనివ్వరు.. కుదురుగా ఉండరు

కాంగ్రెస్ కు పార్టీకి పట్టిన దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ నేతలే. సీనియర్లు ఎవరూ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోరు.

Update: 2022-09-27 07:38 GMT

కాంగ్రెస్ కు పార్టీకి పట్టిన దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ నేతలే. సీనియర్లు ఎవరూ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోరు. బతికున్నంత కాలం బట్ట నలగకుండా దర్జాగానే బతకాలంటారు.వయసు 70కి పైబడినా శరీరం, మనసు సహకరించకపోయినా పదవులను వీడేందుకు ఇష్టపడరు. అందుకే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎదగడం లేదు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బ తినడానికి సీనియర్ నేతలే కారణమని చెప్పకతప్పదు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పదవులన్నింటినీ సీనియర్లకే ఆ పార్టీ హైకమాండ్ కట్టబెడుతూ వస్తుంది. చివరకు వారే కాంగ్రెస్ కు శత్రువులుగా మారుతున్నారు. వేరు కుంపటి పెట్టుకుంటున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు.

సీనియరిటీ ముసుగులో...
మొన్న కమల్ నాధ్, నిన్న గులాం నబీ ఆజాద్ నేడు అశోక్ గెహ్లాత్. ఈ ముగ్గురు వయసుడిగి పోయిన వారే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు తమకు పదవులు కావాలంటారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులను ఆశిస్తారు. ఇవ్వకపోతే అలుగుతారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకుని కాంగ్రెస్ హైకమాండ్ వారికి కీలక పదవులు కట్టబెడుతూ వస్తుంది. కానీ వారి పదవులు దాహం మాత్రం అధికారాన్ని కోల్పోయినా తీరదు. ఏదో ఒక ట్యాగ్ తగిలించుకుని తిరగాలనే కోరుకుంటారు. పదవులు దక్కకపోతే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనుకడరు. అందుకనే అనేక రాష్ట్రాల్లో యువనేతలు కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు.
మధ్యప్రదేశ్ లోనూ...
మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోవడానికి కమలనాథ్ కారణం కాదా? ఆయన హుందాగా తప్పుకుని ఉంటే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ బాట పట్టేవారా? కాంగ్రెస్ తో నమ్మకంగా సాగిన ఒక యువనేతను కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం స్థానాలను కూడా సాధించలేకపోయింది. మరి కమల్ నాథ్ సత్తా ఏంటో తెలిసిపోలేదా? ఇక తాజాగా రాజస్థాన్ ను తీసుకుంటే సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి పార్టీలో అత్యున్నత స్థాయి పదవి అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ ను ఆయన కాదనుకున్నారు. సీఎంగా తాను మాత్రమే ఉండాలని, తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే తన వర్గం వారిని సీఎంగా ఎంపిక చేయాలన్న షరతు పెట్టారు.
తాజాగా రాజస్థాన్ లో....
వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ఒంటి చేత్తో ఎదుర్కొనే సత్తా ఈ పెద్దాయనకు లేదు. మళ్లీ సచిన్ పైలట్ అవసరం పార్టీకి ఉంటుంది. పార్టీ కంటే తన వ్యక్తిగతమే ముఖ్యం. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈసారి సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను ఎగదోసి హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండి పడుతుంది. దీంతో అశోక్ గెహ్లాత్ ను అధ్యక్ష పదవి రేసు నుంచి అధిష్టానం తప్పించనుంది. కమల నాథ్ ను అనుకున్నా ఆయన కూడా నో చెప్పారు. ఎందుకంటే మళ్లీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. దీంతో నమ్మకమైన నేతలే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెడుతుండటంతో కొత్తగా దిగ్విజయ్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కూడా యువనేతకు ఏఐసీసీ అధ్యక్ష పదవీ బాద్యతలను అప్పగిస్తే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News