మొబైల్ ఫోన్లు.. ఇవి చేతుల్లో, జేబుల్లో లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే మొబైల్ ఫోన్లకు, ఓటింగ్ కు సంబంధం ఏముందనుకుంటున్నారా? ఖచ్చతంగా ఉంది. తెలంగాణలో పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని గత కొద్ది రోజులుగా ఎన్నికల అధికారులు చెబుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో మొబైల్ ఫోన్లను పోలీసులు, ఎన్నికల అధికారులు అనుమతించారు. కానీ ఈసారి మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.
భద్రత ఏర్పాట్లేవీ?
అయితే మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు అధికారులు చేయకపోవడంతో అనేక మంది ఓటర్లు ఫోన్ల కోసం ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈ పరిస్థితి కన్పించింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దయెత్తున ప్రచారం చేశారని, మొబైల్ ఫోన్లపై ప్రచారం చేయకపోవడం వల్లనే తాము ఫోన్లతో పోలింగ్ కేంద్రానికి వచ్చామని యువ ఓటర్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ నిబంధనతో సెల్ ఫోన్లు ఓటింగ్ శాతం తగ్గిస్తాయేమోనన్న ఆందోళన ఇటు రాజకీయ పార్టీల్లోనూ, అటు అధికారుల్లోనూ కనపడుతోంది.