ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన ఫిట్ నెస్ వీడియో పోస్ట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఆయన తాను యోగాసనాలు, ఇతర ఎక్సర్ సైజులు చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోపై కూడా కొందరు విమర్శలు గుప్పించారు. ఈ వీడియో చిత్రీకరణ కోసం పెద్దఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయితే, ఈ విమర్శలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. ఆయన వీడియో తీసేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ప్రధాని ఫిట్ నెస్ వీడియో ఖర్చు ఎంతో చెప్పాలని ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి జవాబిచ్చిన పీఎంఓ అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని చెప్పింది. ఈ వీడియోను పీఎంఓ ఫోటోగ్రాఫర్ తీశారని, ఇందుకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు పెట్టలేదని తేల్చింది.