లోకేష్ కు ఏ దారి కన్పించడం లేదట
ఈసారి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఇటీవల నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద పదవే. చంద్రబాబు తర్వాత పార్టీలో నెంబర్ 2. కానీ ముద్దుపేరు చిన బాబు. ఏ ముహూర్తాన ఆయన రాజకీయాల్లోకి వచ్చారో తెలియదు కాని ఐరన్ లెగ్ గా మారిపోయారు. ఎక్కడకు వెళ్లినా ఓటమి ఆయన వెంటే పరుగులు తీస్తున్నట్లుంది. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిన నారా లోకేష్ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చింది ఐదేళ్లే. ఈ ఐదేళ్లలో లీడర్ గా రాటుదాలాల్సిన లోకేష్ రోజురోజుకూ పార్టీలో పలుచనగా మారుతున్నారు.
టీం చెప్పినట్లే....
లోకేష్ కు రాజకీయాలు తెలియవంటారు. ఆయన వెన్నంటి ఉన్న ఒక టీం చెప్పిన ప్రకారమే నడుచుకుంటారని చెబుతారు. వారిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతారు. అంతే తప్ప ఆయనకు రాజకీయ పరిజ్ఞానం అంతగా లేదు. జగన్ ను నేరుగా విమర్శించి నేతను కావాలనుకుంటున్నారు తప్పించి మరో మార్గంలో లోకేష్ ప్రయాణించడం లేదు. తండ్రి చాణక్యం కూడా లోకేష్ కు వంట బట్టలేదు. తాత భాష పరిజ్ఞానం కూడా రాలేదు.
భావినేతగా...
లోకేష్ ను భావినేతగా ఒప్పుకునేందుకు సొంత పార్టీ నేతలు అంగీకరించడం లేదు. ఆయనకు నాయకత్వ పటిమలేదు. ప్రజలను ఆకట్టుకునే శక్తి , సామర్థ్యం లేదు. బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రసంగించినా వాటిలో పదును లేదు. ఆయన ప్రచారం చేసిన చోట పరాజయం తప్ప మరోమాట విన్పించడం లేదు. అందుకే లోకేష్ ను ప్రచారానికి భవిష్యత్ లో తీసుకెళ్లేందుకు కూడా నేతలు జంకుతారు. లోకేష్ ను తమ నియోజకవర్గాల్లో పర్యటించమని కోరే నేతలు రానున్న కాలంలో తగ్గుతున్నారు.
ఖర్చు తప్ప....
లోకేష్ ను ఆహ్వానిస్తే ఖర్చు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్న నిర్ధారణకు నేతలు వస్తున్నారు. ఇటీవల తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ లోకేష్ ప్రచారం చేసి వచ్చారు. అక్కడ కూడా దారుణమైన ఓటమి ఎదురయింది. లోకేష్ బహిరంగ సభలు, రోడ్ షోలు మానుకుని ప్రజల్లోకి వెళ్లే మారో మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో రాణించినా, రాజకీయంగా ఎదగలేెక పోతున్నారు. రాజకీయంగా ఎలాంటి క్వాలిఫికేషన్ లు లోకేష్ కు లేవన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.
మరోసారి మంగళగిరిలో.....
అయితే ఈసారి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లే కనపడుతుంది. అందుకే ఆయన ఇటీవల తరచూ ఆ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాల్సిన లోకేష్ ఆలోచన మంచిదే. అదే సమయంలో మంగళగిరి ప్రజలకు నమ్మకం కల్గించాల్సి ఉంటుంది. రాజధాని అంశం, ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు గెలవడం తనకు ఖచ్చితంగా ఈసారి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఆయన మంగళగిరిని వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు.