రాజుగారి రాజీనామా ధైర్యం అదేనా?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్లమెంటు పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుంది
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్లమెంటు పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఈ నెల 7వ తేదీన రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో మరో ఉప ఎన్నిక తేవాలని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. అందుకే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
వైసీపీలో ఉండాలనేనా?
రఘురామ కృష్ణరాజు నిజానికి తొలి నుంచి పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ వైసీపీలోనే కొనసాగుతూ రెబల్ గా ఉండాలని భావించారు. కానీ బ్యాంకు రుణాల ఎగవేత కేసు మెడకు చుట్టుకునే అవకాశముంది. మరోవైపు అనర్హత వేటు కూడా పెండింగ్ లో ఉంది. దీంతో తాను సేఫ్ లో ఉండాలని రఘురామ కృష్ణరాజు భావించినట్లుంది. ఎంపీ పదవి కంటే ఆయను బ్యాంకు రుణాల ఎగవేత కేసు వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతుంది.
స్ట్రాంగ్ గా ఉండటంతో....
నరసాపురం పార్లమెంటు చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. జనసేన కూడా మిత్రపక్షంగా ఉండటంతో రఘురామ కృష్ణరాజు తన గెలుపు సులువు అని భావిస్తున్నారు. నరసాపురం ఉప ఎన్నిక జరిగితే రఘురామ కృష్ణరాజు కు మద్దతుగా టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. దీంతో వైసీపీ అభ్యర్థిపై తనకు సునాయాసం విజయం సాధ్యమవుతుందని రఘురామ కృష్ణరాజు అంచనా వేస్తున్నారు.
సొంత సామాజికవర్గంలో....
దీనికి తోడు రఘురామ కృష్ణరాజుపై ఆయన సొంత సామాజికవర్గంలోనూ సానుభూతి ఉంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం, కొట్టడం వంటివి క్షత్రియ సామాజికవర్గంలో రాజుగారికి మరింత బలం పెంచాయంటున్నారు. క్షత్రియ సామాజికవర్గంలోని అగ్రనేతలందరూ ఆయనతో టచ్ లో ఉండటంతో రాజుగారు రాజీనామా ధైర్యం చేయనున్నారని తెలిసింది. ఉప ఎన్నికను తెచ్చి జనరల్ ఎన్నికలకు ముందు జగన్ కు తిప్పలు తెచ్చి పెట్టాలన్నదే రఘురామ కృష్ణరాజు ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రఘురామ కృష్ణరాజు రాజీనామా ఖాయమన్నది ఢిల్లీలో విన్పిస్తున్న టాక్.