బీసీ రిజర్వేషన్ల శాతం పెరగనుందా..?

బిహార్‌లో సోమవారం ప్రకటించిన కులాల వారీ వివరాలు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయనున్నాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అందుతున్నా, దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాజకీయాలను అగ్రవర్ణాలే శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కులాల వారీ జనాభాను లెక్కించడం, వారి ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వేను నిర్వహించడం ద్వారా బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ యాదవ్‌ ఓ సంచలనమైన మార్పునకు కారణమయ్యారు.

Update: 2023-10-03 05:50 GMT

యాభై శాతం దాటనున్న రిజర్వేషన్లు!

బీసీలకు మరిన్ని అవకాశాలు!

బిహార్‌ కులగణన తో మారనున్న దేశ రాజకీయ ముఖచిత్రం

బిహార్‌లో సోమవారం ప్రకటించిన కులాల వారీ వివరాలు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయనున్నాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అందుతున్నా, దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాజకీయాలను అగ్రవర్ణాలే శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కులాల వారీ జనాభాను లెక్కించడం, వారి ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వేను నిర్వహించడం ద్వారా బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ యాదవ్‌ ఓ సంచలనమైన మార్పునకు కారణమయ్యారు. బిహార్‌ కులగణన వెనుక చాలా వ్యూహాలు ఉన్నాయి. ఆర్థికంగా ముందంజలో ఉన్న కులాలను గుర్తించడం, ఇంకా వెనుకబడే ఉన్న కులాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం... పైకి కనిపిస్తున్న కారణాలు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనడం నితిష్‌ మరో వ్యూహం. అందుకే సమగ్ర కులగణపై బీజేపీ వ్యతిరేకించినా, నితీష్‌ కుమార్‌ యాదవ్‌ మాత్రం ముందుకే వెళ్లారు.

సోమవారం వెలువరించిన కులగణన వివరాల ప్రకారం... తీవ్రంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు 36శాతం మంది ఉన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన వారు 27.12 శాతం మంది, జనరల్‌ కేటగిరీలో 15.5 శాతం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 19.68 శాతం, ఎస్టీ కేటగిరీకి చెందిన వారు 1.68 శాతం మంది ఉన్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఓబీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు గతంలో సూచించింది. ఈ విషయంలో తమిళనాడుకు మాత్రమే మినహాయింపు ఉంది. ఆ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బిహార్‌ తరహాలో అన్ని దేశంలో కూడా కులగణన చేపట్టినట్లయితే రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశవ్యాప్త కులగణనకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ వారసుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. అదే జరిగితే దేశంలో సామాజికంగా, రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలో వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్లు రాజకీయ అధికారాన్ని చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీసీ,. ఎస్సీ కులాల్లో... వారి మధ్య వారికే సమన్వయం లేని పరిస్థితుల్లో... వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమా? అనేది అసలు ప్రశ్న.  జనాభా ప్రకారం తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను రెండు అగ్ర సామాజిక వర్గాలే దశాబ్దాల తరబడి శాసిస్తుండటమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

ఆంధ్ర ప్రదేశ్‌ కూడా కులగణనకు సై అంటోంది. దేశవ్యాప్తంగా కూడా కుల గణన చేపట్టాలని ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. మరోవైపు 2011 తర్వాత జనగణన కూడా చేపట్టలేదు. కొవిడ్‌ కారణంగా జనగణన వాయిదా పడిరది. రాబోయే కాలంలో జన, కుల గణనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1990లో నాటి కేంద్రం ఆమోదించిన మండల్‌ కమిషన్‌ నివేదిక దేశంలో ఓబీసీలకు 27 శాతాన్ని ఇచ్చింది. దీనిని 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. తమను బీసీల్లో కలపాలని కొన్ని అగ్రకులాలు కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త కులగణన, వారి ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను తేటతెల్లం చేస్తుంది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చనుంది. 

Tags:    

Similar News