మోదీతో ఇక యుద్ధం చేయక తప్పదా?

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ పై వత్తిడి మరింత పెరిగింది

Update: 2021-12-17 04:27 GMT

కేంద్ర ప్రభుత్వం తేనెతుట్టెను కదిలించింది. నీతి ఆయోగ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో మరింత ఆజ్యం పోసింది. అత్యంత వెనకబడిన ప్రాంతమైన బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ ప్రకటన వైసీపీ పై వత్తిడి మరింత పెరిగేదిలా కనపడుతుంది. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చట్ట సభల సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి చేసిన ప్రకటనను పక్కన పెట్టి హోదా ఇవ్వలేమన్న బీజేపీ ఇప్పుడు బీహార్ కు ఎలా ఇస్తుందన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు...
బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన ప్రకటన అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అప్పటి మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అందుకు చంద్రబాబు సయితం అంగీకరించారు. వైసీపీ వ్యతిరేకించింది. తన పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించింది.
ఏపీకి మాట ఇచ్చి....
ఇక ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. బీజేపీకి ఉభయ సభల్లో బలం ఉన్నందున ప్రత్యేక హోదా పై వత్తిడి తేలేమని వైసీపీ చెబుతూ వస్తుంది. కానీ బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పిన తర్వాత జగన్ పార్టీ ఇక తాడో పేడో తేల్చుకోక తప్పదు. లేదంటే రాజకీయంగా జగన్ కు నష్టం జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
బాబును పట్టించుకోక పోయినా...
ఈ అంశాన్ని టీడీపీ అందిపుచ్చుకునే అవకాశముంది. చేతకాని జగన్ వల్లనే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతున్నామని టీడీపీ ప్రచారం చేస్తుంది. అయితే ఒకసారి ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకున్న చంద్రబాబు తిరిగి హోదా నినాదం ఎత్తుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కాని, ప్రజల్లో మాత్రం వైసీపీ పట్ల కొంత అననుకూలత ఏర్పడే అవకాశాలున్నాయి. పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతుండటంతో దీనిపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధపడకపోతే రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీకి నష్టం తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News