నాదెండ్లకు "నో" చెబుతారా?

జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు

Update: 2023-06-08 05:27 GMT

జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన వాస్తవంగా తెనాలి నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయనను తొలి నుంచి ఆదరించిన నియోజకవర్గం తెనాలి కావడంతో అక్కడి నుంచే పోటీ చేస్తారని నిన్న మొన్నటి వరకూ అందరూ భావించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. జనసేన కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా ప్రత్యేకంగా కోరుకుంటుంది. కానీ అందులో తెనాలి కూడా ఒకటని ఇప్పటి వరకూ అందరూ అంచనా వేశారు. కానీ పొత్తుల్లో భాగంగా సీట్లు కేటాయంచడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి ఈసారి టీడీపీ తీసుకోనుంది.

గత ఎన్నికలలో...
తమకు గత ఎన్నికల్లో బలంగా నిలబడిన నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చే అవకాశం లేదనే పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న లెక్కలు ఇవి స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ మరింత బలంగా మారింది. పసుపు పార్టీ కార్యకర్తల్లో కూడా టీడీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఒంటరిగా వచ్చేటన్ని సీట్లు తెచ్చుకోవాలన్నది ప్రతి టీడీపీ కార్యకర్త ఆకాంక్ష. కానీ పొత్తులు లేకుండా వెళితే జగన్ ను ఎదుర్కొనడం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో ఖచ్చితంగా కలసి వచ్చే పార్టీలను కలుపుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుది. ఈ నేపథ్యంలో కీలకమైన నియోజకవర్గాలు...అందులో కోస్తాంధ్రలో ఉన్న బలమైన నేతలకు ఈసారి పొత్తుల కారణంగా దక్కకుండా పోతే ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు సయితం అభిప్రాయపడుతున్నారు. వరసగా జరుపుతున్న తన సభలకు జనం తండోపతండాలుగా రావడం, రెండు మహానాడులు వరసగా సక్సెస్ కావడం, లోకేష్ యువగళం పాదయాత్ర వంటివి ఆయనలో ఈ ఆలోచనలు తెచ్చాయని చెబుతున్నారు.
తనకు అనుకూలమైన...
నాదెండ్ల మనోహర్ నిజానికి తెనాలి నుంచి రెండు సార్లు గెలిచారు. 2004,2009లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి సత్తా చాటారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1994లో ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు కూడా తెనాలి నుంచి గెలిచారు. కానీ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్‌కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా డిపాజిట్లు కూడా రాలేదనే చెప్పాలి. వైసీపీ అభ్యర్థికి 94 వేలు, టీడీపీ అభ్యర్థికి 76 వేలు ఓట్లు వస్తే, నాదెండ్లకు 29 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన ఈసారి సేఫ్ ప్లేస్ చూసుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం నుంచి నాదెండ్ల పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది.
ఆలపాటికి సంకేతాలు...
దీనికి తోడు తెనాలి నియోజకవర్గంలో జనసేన కన్నా టీడీపీ బలంగా ఉండటంతో ఆ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు లేవు. ఇక ఏదైనా పవన్ కల్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్‌ తో చివరి నిమిషంలో నాదెండ్లను అకామ్‌డేట్ చేస్తే చెప్పలేం కానీ, ఇప్పటికయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మాత్రం అక్కడే పనిచేసుకోవాలని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆలపాటి కూడా తెనాలి నుంచి పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మరి నాదెండ్ల జనసేనలో నెంబర్ 2 గా ఉండటంతో ఎక్కడ నుంచి ఆయన బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగానే ఉంది.


Tags:    

Similar News