మతమే మా అభిమతం!
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి సరికొత్త అస్త్రాన్ని అందిస్తున్నాయి. ఎలాంటి శషభిషలు లేకుండా హిందుత్వను సమర్ధించే భాజపాకు వివాదాలను తనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో బాగా తెలుసు. ‘మతం’ అనే సృ ్పహ మెజార్టీ జనంలో బాగా నాటుకుంటున్న వేళ... దానిని క్యాష్ చేసుకోవడానికి కమలం పార్టీ సిద్ధమైపోతోంది.
'మజారిటీ' ఓట్ల కోసం రాజకీయ పార్టీల పాట్లు
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి సరికొత్త అస్త్రాన్ని అందిస్తున్నాయి. ఎలాంటి శషభిషలు లేకుండా హిందుత్వను సమర్ధించే భాజపాకు వివాదాలను తనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో బాగా తెలుసు. ‘మతం’ అనే స్పృహ మెజార్టీ జనంలో బాగా నాటుకుంటున్న వేళ... దానిని క్యాష్ చేసుకోవడానికి కమలం పార్టీ సిద్ధమైపోతోంది.
ఎక్కడో తమిళనాడులో ఓ చిన్న సమావేశంలో ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్త వివాదంగా మారుస్తూ మరోసారి ఓట్ల వేటలో పడిరది మోదీ అండ్ టీం. కేంద్రంలో భాజపాను గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ బ్లాక్ ఉదయనిధి వ్యాఖ్యలపై ఇరకాటంలో పడిరది. ‘ఇండియా’ టీంలో డీఎంకే కూడా యాక్టివ్ మెంబర్. కాంగ్రెస్ నేతృత్వంలో ‘ఇండియా’ నడుస్తున్నా సరే.. కొన్ని విషయాల్లో ఆ గ్రూపు సభ్యుల మధ్య సమన్వయమే లేదు. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పోరాడుతూ కేంద్ర స్థాయిలో మాత్రం ఉమ్మడిగా పోటీ చేయడానికి కొన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి.
‘ఇండియా’ టీం నుంచి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. ఓ నాలుగు సార్లు సమావేశమైనా, మత తత్వం నుంచి దేశాన్ని కాపాడటమనే అజెండా తప్పితే మరొకటి కనచూపు మేరలో కనిపించడం లేదు. అతుకుల బొంత లాంటి ‘ఇండియా బ్లాక్’కు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్లు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సనాతన ధర్మానికి మలేరియా, డెంగ్యూ లాంటిదని, దానిని వ్యతిరేకిస్తే చాలదని, పూర్తిగా నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవకాశం చాలు... బీజేపీకి ఓట్లు పిండుకోడానికి. ఉదయనిధి వ్యాఖ్యలు వైరల్ కావడంతో కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్‌లో ఉండే పార్టీలకు సీటు కిందకు వేడి తగిలింది.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెంటనే ఈ అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. సోమవారం రాజస్థాన్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ సనాతన ధర్మంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. డీఎంకే, ఆ పార్టీ భాగస్వామి కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ ఇప్పటికే పోసిన పెట్రోల్‌కు నిప్పంటించారు. దీంతో కాంగ్రెస్ డ్యామేజీ కంట్రోల్‌కి రంగంలోకి దిగింది. ‘అన్ని మతాలను గౌరవించడమే తమ విధానమ’ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాద్ మాత్రం ఉదయనిధి మాటలను ఖండిరచారు. ‘సనాతన ధర్మంపై మంత్రి మాటలు అతని వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. నేను మాత్రం వాటితో ఏకీభవించను’ అంటూ ఓట్లు కాపాడుకునే పాట్లు పడుతున్నారు. ఉద్దవ్ థాక్రే లాంటి వాళ్లు ఉదయనిధి మాటలను ఖండిరచారు. మమతా బెనర్జీ కూడా ‘ఉదయనిధివి కుర్రాడి మాటలు’ అంటూ వివాదం నుంచి దూరం జరిగారు. ఇప్పుడు ఇండియా బ్లాక్‌లో ఉండే పార్టీల్లో కొన్నయినా హిందుత్వను సమర్థించాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే బీజేపీకి కావాలి. హిందుత్వను తమ పార్టీ మాత్రమే కాపాడుతుందని జనాల్లోకి మెసేజ్ వెళ్తే చాలు... అధికారం మరో పదేళ్లు తమదే.
రాబోయే ఎన్నికల్లో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి, అదానీ కుంభకోణం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని భాజపా కూల్చడం, చీల్చడం... ఇవేవీ ఎన్నికల అంశాలు కాబోవు. కేవలం హిందూ, యాంటీ హిందూ మాత్రమే ఎన్నికల అంశం అవుతుంది. దేశంలో ఎన్నో సమస్యలుండగా... మతమే ప్రధాన సమస్యగా మారడం ఆధునిక భారతం చేసుకున్న దురదృష్టం.