టిడిపితో పొత్తుపై.. పవన్ మనసులో మాట ఇది !
ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏం చేయడానికైనా జనసేన ముందుంటుందని, తన వ్యక్తిగత ఎదుగుదల కోసం రాజకీయాల్లోకి..
నంద్యాల : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, జనసేన తరపున ఆర్థిక సహాయం అందించారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు శిరివెళ్లమండలం గోవిందపల్లికి వచ్చిన పవన్ ను మీడియా ప్రతినిధులు.. టిడిపితో పొత్తుపై ప్రశ్నించారు. జనసేనతో పొత్తుకు టిడిపి ఆహ్వానిస్తే ఏం చేస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా.. జనసేన ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తుందని బదులిచ్చారు.
ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏం చేయడానికైనా జనసేన ముందుంటుందని, తన వ్యక్తిగత ఎదుగుదల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. జనసేన ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ.. ప్రజల పక్షాన, ప్రజా సమస్యలను తీర్చేందుకు పోరాడుతుందని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం, రాష్ట్ర భవిష్యత్తుకు జనసేన అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కాగా.. గతంలో వైసీపీ ఓట్లు చీలకూడదని భావిస్తున్నట్లు పవన్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు గుర్తు చేశారు.
ఓట్లు చీలే అంశంపై మాట్లాడుతూ.. "ఆ మాట నా నోట రావడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ పాలనే. రాష్ట్రంలో ఎవ్వరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు. వ్యతిరేక ఓటు చీలి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం మరింత దిగజారిపోతుంది. ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే.. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి" అని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రస్తుతం బీజేపీతో తమ అనుబంధం బాగుందని చెప్పిన పవన్.. రోడ్ మ్యాప్ కు సంబంధించిన విషయాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.