అధికారంలోకి వస్తే....
జనసేన పార్టీగా అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరిస్తుందని చెప్పారు. బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. దేవదాయ శాఖ చట్టంలో మార్పులు తెచ్చి ఆలయాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడమే తన లక్ష్యమని పవన్ వివరించారు. ప్రభుత్వరంగంలో ప్రతి ఖాళీని భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. తాను కులాల ఐక్యత కోరుకునేవాడనని, విభజన కాదని ఆయన అన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ఎలా వైసీపీ భావిస్తుందని ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అకారణంగా తనను దూషించారన్నారు.
అన్నీ రివర్స్ నిర్ణయాలే....
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అమరావతిని రాజధానిగా ఆ ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం దానిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చిందన్నారు. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగించాలని అన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవని పవన్ చెప్పారు. ఆరోజు కూడా రాజధాని రైతులు భూములు ఇవ్వడాన్ని ఇష్టపడలేదంటే టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించానని పవన్ గుర్తు చేశారు. రాజధానిని నిర్ణయించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాడిదలు కాస్తున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో అన్ని వర్గాల ప్రజలున్నారన్నారు. రాజధాని మారుస్తామంటే ఎవరు ఒప్పుకుంటారన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని, ఎక్కడకు వెళ్లదని పవన్ భరోసా ఇచ్చారు. ఇక్కడి నుంచి అమరావతి కదలదని, మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చివరకు న్యాయవ్యవస్థను కూడా తప్పుపట్టే సాహసానికి వైసీపీ ఒడిగట్టిందన్నారు.
క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే.....
వైసీపీ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఉద్యోగులు, మహిళలు, పోలీసుల, బలహీనవర్గాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని పవన్ అన్నారు. అవగాహన లేకుండా ఎందుకు హామీ ఇచ్చారని పవన్ ప్రశ్రించారు. పార్టీ రంగుల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. వీటికి బదులు ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చు కదా? అని పవన్ నిలదీశారు. పీఆర్సీ అంటే జీతాలు పెరుగుతాయని అనుకుంటామని, కానీ ఇక్కడ రివర్స్ అని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని మడమ తిప్పారన్నారు. రహదారుల పరిస్థితి ఏమాత్రం బాగాలేవన్నారు. రోడ్డు ప్రమాదాలు పది శాతం, మరణాలు 14 శాతం పెరిగాయని చెప్పారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే పాలన ఉంటుందని పవన్ అన్నారు.
కూల్చివేతలతో మొదలు.....
రెండున్నరేళ్ల వైసీపీ పాలన కూల్చివేతలతో మొదలయిందన్నారు. అశుభంతో పాలన ప్రారంభమయిందన్నారు. మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చి భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారి జీవితాలను ఇసుక పాలసీతో చిందరవందర చేశారన్నారు. 36 మంది ప్రాణాలను బలితీసుకున్నారన్నారు. విధ్వంసపూరిత ఆలోచనలతో వైసీపీ పాలన సాగుతుందన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే....
ఆంధ్రప్రదేశ్ తమ సొంత భూమి అని, ప్రజలు తమ బానిసలమని ప్రతిజ్ఞ చేసి వైసీపీ నేతలు వచ్చి ఉంటారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ఆదాయవనరులను పెంచుకోవడానికే పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చామన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లకు వెనక్కు, ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూలుకెళ్లే పిల్లల చేతుల్లో నుంచి చాక్లెట్లు లాగేసుకుంటామని ప్రతిజ్ఞ చేసి వచ్చి ఉంటారని ఆయన అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థికమూలాలు దెబ్బతీస్తామని, కన్పించిన భూమిని కబ్జా చేస్తామని అధికారంలోకి రాగానే ఓత్ తీసుకుని ఉంటారన్నారు.
వాళ్లు తొడగొడుతుంటే నవ్వొస్తోంది....
జనసేన చేస్తుంది రామకార్యంతో సమానమని చెప్పారు. వైసీపీ వాళ్లు గెలిచి తొడ గొడుతుంటే తనకు కోపం రాదని, నవ్వు వస్తుందని చెప్పారు. జనసేన సభ ప్రారంభం ముందే వెల్లంపల్లి, అవంతి వంటి వారు తనపై విమర్శలకు దిగారన్నారు. వైసీపీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాగంటి శ్రీనివాసులురెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి మంచి నేతలున్నారు. వారిని హర్ట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఓడిపోయినంత మాత్రాన తాను బాధపడలేదని, వైసీపీ మంచి చేస్తుందని భావించానని అన్నారు. ఒక పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం కావాలన్నారు. తనపై ఎవరిపైనా వ్యక్తిగత విభేదాలు ఉండవని, విధానాలనే విమర్శిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.
పేరుపేరునా నమస్కారాలు....
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వామపక్ష పార్టీ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డికు పవన్ ప్రత్యేకంగా నమస్కారాలు తెలిపారు. వైసీపీలో మంచి నేతలు, కార్యకర్తలున్నారని, వారికి కూడా నమస్కారాలు తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డ లాంటి మంచి నేతలు వైసీపీలో ఉన్నారని పవన్ అన్నారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలతో పాటు మంచి నేతలు కూడా ఉన్నారన్నారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ కు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ రాజకీయ పార్టీల నేతలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమందికి నమస్కారాలంటే అది జనసేన సంస్కారం అని అన్నారు.
ప్రశ్నించడాన్ని తేలిగ్గా తీసుకోకండి....
రాజకీయం అంటే పట్టువిడుపులుండాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ బాగుండాలని, చీకట్లోకి వెళ్లకూడదనుకుంటే జనసేన కార్యకర్తలు ఐదు లక్షల మంది కార్యకర్తల చేతుల్లో ఉందని చెప్పారు. జనసైనికులు లేకపోతే తాను లేనని చెప్పారు. ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నామని నేతలు భావిస్తున్నారని, ప్రశ్నించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదన్నారు. ప్రశ్నించడమంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండటమని, సుపరిపాలనకు శ్రీకారం చుట్టడమని పవన్ అభిప్రాయపడ్డారు. తాను పాటించిందే కార్యకర్తలను అడగనని, కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డం వేస్తామని చెప్పారు.
ఇప్పటానికి యాభై లక్షల విరాళం....
2014లో తాను పార్టీని ప్రారంభించానని, అప్పటి నుంచి తనకు అండగా ఉన్న కార్యకర్తలందరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరితో ప్రారంభమైన జనసేన ప్రస్థానం నేడు క్షేత్రస్థాయిలో విస్తరించిందన్నారు. ఏడు నుంచి 27 శాతానికి ఓటు బ్యాంకును పెంచుకున్నామని చెప్పారు. అధికారం దిశగా జనసేన పయనిస్తుందని తెలిపారు. ఎంతమందిని ప్రభావితం చేయగలిగామన్నది నాయకత్వానికి ముఖ్యమని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తమ సభ ఏర్పాట్లకు అనుమతిచ్చిన ఇప్పటం గ్రామ పంచాయతీకి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు.