టార్గెట్ నాని... బందరులో సేనాని
మాజీ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలను మచిలీపట్నంలో పెట్టారంటున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. మితృత్వం ఉండదంటారు. అయితే తాత్కాలికంగానైనా.. శాశ్వతంగానైనా కొందరు రాజకీయ నేతలు శత్రువులుగానే చూస్తుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు వైసీపీ అధినేత జగన్ మీద కన్నా మాజీ మంత్రి పేర్ని నాని, గుడివాడ అమరనాధ్ ల పైనే ఎక్కువ ఆగ్రహం ఉంటుంది. ముఖ్యంగా పేర్ని నాని తాను కార్యక్రమం చేసిన కొద్ది సేపటికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తుంటారు. క్షణం కూడా ఆలస్యం చేయరు. పవన్ పై తన మాటలతో పేర్ని నాని విరుచుకుపడుతుంటారు.
ప్రతి వ్యాఖ్యకు...
పవన్ చేసే ప్రతి వ్యాఖ్యకు పేర్ని నాని సూటిగా కౌంటర్ ఇస్తారు. అదే సామాజికవర్గం కావడంతో ఆయన అంటే జనసైనికులకు కూడా కోపమే. పేర్ని నాని కౌంటర్లను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పేర్ని నాని పై కూడా పవన్ కల్యాణ్ అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తుంటారు. ఇలా ఇద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో పేర్ని నానిని ఓడించాలన్నది జనసేనాని లక్ష్యంగానే కనిపిస్తుంది. తనపై విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న పేర్నినానిపై పవన్ కు ఉన్న ఆగ్రహాన్ని మనం బహిరంగంగానే చూస్తుంటాం.
ఆవిర్భావ సభ
ఇప్పుడు అదే జరుగుతుంది. సాధారణంగా జనసేన ఆవిర్భావ సభను మంగళగిరిలోనే నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా మచిలీపట్నంలో నిర్వహించాలనుకోవడం పేర్ని నానిని టార్గెట్ చేయడానికేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మార్చి 14న జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈసారి మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు తెలిపారు. ఈ సారి మచిలీపట్నంలో నిర్వహించడంలో మరో ప్రత్యేకత ఏమీ లేదు. కేవలం పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని జనసేన ఆవిర్భావ సభలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు కనపడుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
నాని ఇలాకాలోనే...
పేర్ని నాని ఇలాకాలోనే జనసేనాని ఈ నెల 14న గర్జించబోతున్నారు. ఆయనపై ఎలాంటి విమర్శలు చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పేర్ని నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మార్చి 14వ తేదీన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారహి ద్వారా రోడ్డు మార్గంలో పవన్ కల్యాణ్ చేరుకుంటారు. దారిపొడవునా జనసేనానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి జనసేన ఆవిర్భావ సభలు మచిలీపట్నంలో జరుగుతుండం ఒక విశేషంగానే చూడాలి. మరి పవన్ చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చే పేర్ని నాని ఈసారి తన ఇలాకాలో జరుగుతున్న సభలో వచ్చే విమర్శలకు ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.