Revanth reddy : మాది పాజిటవ్ అప్రోచ్... అలాగే ప్రజల వద్దకు వెళతాం

తెలంగాణ సమాన అభివృద్ధి కోరుకుంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2023-11-03 06:19 GMT

తెలంగాణ సమాన అభివృద్ధి కోరుకుంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు. సోనియాగాంధీ చొరవవల్లనే తెలంగాణ వచ్చిన విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఏపీలో పార్టీ పూర్తిగా పోతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చేందుకే ఆమె మొగ్గు చూపారన్నారు. విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది కాని, కేసీఆర్ ఆమరణ దీక్షతో కాదని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసేందుకు....
గతంలో ప్రజాసమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వీలుండేదని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారన్నారు. కానీ కేసీఆర్ సచివాలయానికే రారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీజీని టీఎస్ గా మార్చడం తప్ప ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రతిపక్షాలను కూడా సచివాలయానికి కూడా రానివ్వడం లేదన్నారు. బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని, ఎవరి భవిష్యత్ బాగుపడిందని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయినా తేలిగ్గా తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో...
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఘోరమని కేసీఆర్ కుటుంబం చెబుతోందని, అక్కడ కాంగ్రెస్ గెలవకుంటే వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కదా? అని ఆయన ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. తాము పాజిటివ్ అప్రోచ్ తోనే ప్రజల ముందుకు వెళుతున్నామని చెప్పారు. కేసీఆర్ సంగతి అందరికీ తెలుసునని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి, పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోనే తాము విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News