జలగం అందుకు అంగీకరిస్తారా?

కొత్తగూడెం టీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వనమా వెంకటేశ్వరరావును ఈసారి టీఆర్ఎస్ పక్కన పెడుతుందన్నది వాస్తవం.

Update: 2022-01-09 04:13 GMT

కొత్తగూడెం టీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వనమా వెంకటేశ్వరరావును ఈసారి టీఆర్ఎస్ పక్కన పెడుతుందన్నది వాస్తవం. వనమా కుమారుడు రాఘవ వ్యవహారంతో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఇక ఓడిపోవడం తప్ప మరొకటి లేదన్నది నిజం. వనమా వెంకటేశ్వరరావు కు రాజకీయంగా కొత్తగూడెంలో ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన స్థానంలో మరొకరిని యాక్టివ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది.

ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే....
కొత్తగూడెంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నికలు పూర్తయిన తర్వాత గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జలగం వెంకట్రావు కొంత అసంతృప్తికి గురయ్యారు. జలగం కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగానే మంచి పేరుంది. వనమాను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అప్పట్లోనే వ్యతిరేకించారు.
కాంగ్రెస్ లో చేరాలని....
అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరిపోవాలని ఒక దశలో భావించారు. కాంగ్రెస్ అయితేనే బెటర్ అన్న భావనలో జలగం వెంకట్రావు ఉండి, టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, వనమా వెంకటేశ్వరరావు వర్గాలకు అస్సలు పడదు. పార్టీ అధిష్టానం నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా రాజీ కుదరలేదు. పదవుల విషయంలోనూ జలగం వెంకట్రావు పెద్దగా పట్టించుకోలేదు.
మళ్లీ యాక్టివ్ చేయాలని...
అయితే తాజాగా వనమా రాఘవ ఎపిసోడ్ తో వనమా ఫ్యామిలీ పూర్తిగా రాజకీయంగా కనుమరుగైనట్లే. ఎన్నికలకు ఏడాది ముందే ఇది జరగడంతో ప్రజలు దీనిని అంత తేలిగ్గా మర్చిపోలేరు. టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వనమా కూడా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఫిట్ గా లేరు. దీంతో జలగం వెంకట్రావును మళ్లీ యాక్టివ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. మరి జలగం దీనికి ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News