రోజాకు రోజూ టార్చరే... నువ్వే రక్షించు తల్లీ
రోజాకు రాజకీయ టార్చర్ మామూలుగా లేదు. ఏదో ఒక సమస్యతో ఆమె నగరి నియోజకవర్గంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
ఆర్కే రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి అండగా నిలిచారు. అలాంటి రోజా రాజకీయంగా నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే రోజా ఎక్కువగా అధికారంలో ఉన్నప్పుడే సతమతమవుతున్నారు. రోజాకు రాజకీయ టార్చర్ మామూలుగా లేదు. ఏదో ఒక సమస్యతో ఆమె నగరి నియోజకవర్గంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
రెండుసార్లు వరసగా....
నగరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వరసగా విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆర్కే రోజాకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైతే నియోజకవర్గంలో ఆమెను ఎదిరించారో వారికే పదవులు దక్కుతుండటం రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. తన వెనక పార్టీలోనే కుట్ర జరుగుతుందని రోజా భావిస్తున్నారు. జగన్ కు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది.
టీడీపీ నుంచి థ్రెట్...
రోజా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం కలిగిన నేత. ముఖ్యంగా జగన్ కు పొలిటికల్ గా రోజా పిచ్చి ఫ్యాన్ అని చెప్పాలి. జగన్ ను మాట అంటే ఊరుకునే రకం కాదు. చంద్రబాబు నుంచి ఎవరినైనా ఇట్టే దులిపేస్తారు. అలాంటి రోజా కు నగరిలో ఇప్పుడు టీడీపీ నుంచి పెద్దగా థ్రెట్ లేదు. గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన కేజే కుమార్ భార్య శాంతికి ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. దీనిపై రోజా అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. కేజే కుమార్ తో పాటు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డి ఏకమయ్యారు.
ముఖ్యనేతలతో సమావేశం....
రోజాకు పోటీగా పార్టీ కార్యక్రమాలను వీరు నగరిలో నిర్వహిస్తుండటంతో ఆమెకు తలనొప్పిగా మారింది. క్యాడర్ లో అయోమయం నెలకొంది. దీని వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు రోజా గుర్తించారు. ఆయనకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చక్రపాణిరెడ్డికి శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడంతో ఆమె మరింత అసహనానికి గురయ్యారని తెలిసింది. ముఖ్యమైన తన సన్నిహితులతో సమావేశమై భవిష‌్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని చెబుతున్నారు.