సోది కబుర్లన్నీ... సోషల్‌ మీడియాలో!

ఎప్పటికెయ్యది ప్రస్తుతకప్పటికా మాటలాడి... అని సుమతీ శతకకారుడు ఓ పద్యం చెప్పాడు. పద్య సారాంశం ఎలా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో మన నేతలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మొన్నటివరకూ తప్పు అనిపించింది, నేడు వారికి రైట్‌ అనిపిస్తుంది. తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందనే ధైర్యం వాళ్లది. ఓ నాలుగు రోజులకు జనం తమ మాటలను మరచిపోతారనే నమ్మకం వాళ్లది.

Update: 2023-12-24 13:00 GMT

chandrababu, jagan, pawan

అడ్డంగా దొరుకుతున్న అధినేతలు

ఎప్పటికెయ్యది ప్రస్తుతకప్పటికా మాటలాడి... అని సుమతీ శతకకారుడు ఓ పద్యం చెప్పాడు. పద్య సారాంశం ఎలా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో మన నేతలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మొన్నటివరకూ తప్పు అనిపించింది, నేడు వారికి రైట్‌ అనిపిస్తుంది. తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందనే ధైర్యం వాళ్లది. ఓ నాలుగు రోజులకు జనం తమ మాటలను మరచిపోతారనే నమ్మకం వాళ్లది. సోషల్‌ మీడియా దశదిశలా వ్యాపించిన నేటి కాలంలో... ఈ వేషాలు చెల్లబాటు కావడం లేదు. పదేళ్ల కిందట మాట్లాడిన మాటలు కూడా యూట్యూబ్‌, ఇన్‌స్టా, ట్విటర్‌లలో బయట పడుతున్నాయి. గతం అనే సమాధుల మాటున దాగిన మాటల భూతాలను వెలికి తీస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న నేతల డొల్లతనాన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెడుతున్నాయి. ఈ విషయంలో అంతా ఓ తాను ముక్కలే.

ఇలాంటి విషయాల్లో అడ్డంగా దొరికిపోతున్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఉచితాలు ఇవ్వకూడదు అంటూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1999` - 2004 మధ్య) అంటుండేవారు. తన పాలన, ఆర్థిక విధానాలపై మనసులో మాట అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అనే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వాగ్దానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తానంటున్నారు. 2019లో మోదీని వృత్తిగతంగా, వ్యక్తిగతంగా నానా మాటలు అన్నారు. కుటుంబం లేదని, బంధాల విలువ తెలియదని దూషించారు. ఎన్నికల్లో ఓడిపోగానే భాజపాను ప్రసన్నం చేసుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ను బిహార్‌ దొంగ అని విమర్శించారు. ఇప్పుడు ఆయన సాయంతో అధికారాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడారు. అవన్నీ సోషల్‌ మీడియాలో చలామణి అవుతున్నాయి. వైరి వర్గం చేతిలో అయుధాలుగా మారుతున్నాయి

చంద్రబాబు తర్వాత ఎక్కువగా సోషల్‌ మీడియాకు దొరుకుతున్నది పవన్‌ కళ్యాణ్‌. తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవన్‌ వ్యాఖ్యలు యూట్యూబ్‌లో కోకొల్లలు. కొన్నాళ్లు చే గువేరా అంటారు. మరికొన్నాళ్లు చాతుర్మాస్య దీక్షలు అంటారు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో తాను పుట్టి ఉంటే బాగుణ్ను అంటారు. సామాజిక వర్గాల వారీగా తాను వాళ్ల వాడినే అంటారు. 2019లో చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు వాళ్లతో పొత్తుకు సై అంటున్నారు. గతంలో కేసీయార్‌ కుంటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడటానికి సైతం భయపడుతున్నారు. మొన్న ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి, భారాసను ఒక్కమాట అనడానికి కూడా సాహసించలేదు. పవన్‌ అనిశ్చితి వైఖరి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరలే.

గెలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్‌ మాటలు కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. విమర్శలకు తావిస్తున్నాయి. జగన్‌ తెలివైన రాజకీయవేత్త. జనం కామన్‌సెన్స్‌పై ఆయనకు కాస్త నమ్మకముంది. అందుకే ఆయన తన ప్రత్యర్థుల్లా అడ్డదిడ్డంగా మాట్లాడటం లేదు. సోషల్‌ మీడియాకు దొరికిపోవడం లేదు. పథకాల అమలు సమయంలో తప్ప ఆయన జనం ముందుకు పెద్దగా రారు. తక్కువ మాట్లాడటం ఆయనకు ఓ రకంగా ప్లస్సే అవుతోంది. పెద్ద నాయకులంతా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే, భవిష్యత్తులో నవ్వులపాలు కాకుండా ఉంటారు. జనం మరీ అమాయకులు కారనే సంగతి మన ఘనత వహించిన నేతలంతా గమనిస్తే మంచిది.

Tags:    

Similar News