పంజాబ్ లో మ్యాజిక్ జరుగుతుందా?
పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి అడ్వాంటేజీగా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి అడ్వాంటేజీగా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2017 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటతో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఇక్కడ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. గతంలో అకాలీదళ్ తో పొత్తు ఉన్నప్పుడు కొంత ప్రభావం చూపిన బీజేపీ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
కాంగ్రెస్ కు పట్టున్నా....
నిజానికి ఇక్కడ కాంగ్రెస్ కు మంచి పట్టుంది. ఐదేళ్లలో నాలుగేళ్లు సజావుగా సాగినా చివరి ఏడాది కాంగ్రెస్ కొంత పట్టుకోల్పోయిందనే చెప్పాలి. సిద్దూను పీసీసీ చీఫ్ గా చేయడం, ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తెస్తాయన్న నమ్మకం లేదని చెబుతున్నారు. అయితే రేసులో మాత్రం కాంగ్రెస్ ముందు వరసలోనే ఉంది.
గత ఎన్నికల్లోనూ....
కానీ ఈసారి అనూహ్యంగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయన్న అంచనాాలు కూడా బలంగా వినపడుతున్నాయి. ఆప్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితి 2017లోనూ కన్పించిందని కానీ అప్పుడు 20 స్థానాలకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమయిందన్న వాదనలు కూడా లేకపోలేదు. అప్పుడు కూడా ఆప్ కు మంచి ఆదరణ కన్పించిందని కానీ ఫలితాల్లో మాత్రం అది కనపడలేదనే వారు కూడా లేకపోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ కేవలం ఒక్కస్థానాన్నే దక్కించుకుంది.
ఈసారి మాత్రం....
కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడంతో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో నియోజకవర్గాలను ఊడ్చేస్తుందంటున్నారు. విజయావకాశాలు కన్పిస్తుండటంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఆయన పంజాబ్ పర్యటనకు వెళ్లారు. మొత్తం మీద మరోసారి ఆప్ పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి గత ఎన్నికల మాదిరిగా చతికలపడుతుందా? సీఎం కుర్చీ దక్కించుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది.