జల్లెడ పడుతున్నా.. భలే జంప్ అయ్యాడే
పంజాబ్ ను జల్లెడ పడుతున్నారు. ఎక్కడా అమృత్‌పాల్ సింగ్ జాడ దొరకలేదు. ఆయన కెనడా పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
పంజాబ్ ను జల్లెడ పడుతున్నారు. ఎక్కడా అమృత్‌పాల్ సింగ్ జాడ దొరకలేదు. ఆయన కెనడా పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెదకని ప్రదేశం లేదు. రాష్ట్రమంతా నాకా బందీ ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేశారు. కానీ అమృత్‌పాల్ సింగ్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది రోజులుగా పంజాబ్ పోలీసులు చేసిన కృషి అంతా వృధాగా మారిపోయంది.
నాలుగు రోజుల నుంచి...
నాలుగు రోజుల నుంచి ఆచూకీ దొరకకపోడంతో పోలీసులు టోల్ గేట్ల వద్ద సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో వాహనాలు మారి మరీ మారు వేషంలో పరారయినట్లు గుర్తించారు. రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంపై ఆయన దేశం దాటి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఆయన తలదాచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పంజాబ్ దేశం కావాలంటూ గత కొద్ది రోజులుగా దేశ, విదేశాల్లో వారిస్ పంజాబ్ దే పక్షాన ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
పోలీసుల కన్నుగప్పి...
పోలీసు స్టేషన్ల మీద తెగబడి మరీ తమ అనుచరులను విడిపించుకుని వెళ్లడంతో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. హైకోర్టు కూడా తీవ్రంగా మందలించింది. ఎనభై వేల మంది పోలీసులుండి ఏం చేస్తున్నారని పంజాబ్ హైకోర్టు ప్రశ్నించడం పోలీసుల పనితీరు చెప్పకనే తెలుస్తుంది. అమృత్‌పాల్ సింగ్ కారణంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశముందని ముందు నుంచే హెచ్చరికలు వినపడుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అమృత్‌పాల్ సింగ్ మాత్రం పోలీసులకు చిక్కకుండానే పరారయ్యాడు.