ఢిల్లీలో మోదీ రీడిజైన్ చేస్తారు...తెలంగాణలో కేసీఆర్ రీడిజైన్ చేస్తారని... అవినీతికి వీరు పెట్టిన మారుపేరు రీడిజైనింగ్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రీడిజైనింగ్ స్పెషలిస్ట్ అని ఎద్దేవా చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ విద్యార్థి - నిరుద్యోగ గర్జన సభలో ఆయన ప్రసంగించారు.
రాహుల్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు...
- తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమించినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఇక్కడి ప్రజలు పోరాడారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయని ప్రజలు మహత్తరమైన కల కన్నారు.
- తెలంగాణ ఏర్పడ్డాక ఏ కల కోసం కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కల నెరవేరలేదు.
- తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న వారికి అంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాల జీవితాలు బాగుచేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
- ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేవలం 10 వేలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటిని పూర్తి చేయలేదు.
- విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. రైతులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు. నాలుగేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కాంట్రాక్టు హెచ్ఏఎల్ నుంచి తీసుకుని మోదీ అతని మిత్రుడు అనీల్ అంబానీకి ఇచ్చాడు. యూపీఏ 525 కోట్లకు ఒక్క విమానం కొనాలనుకుంటే, బీజేపీ 1400 కోట్లకు ఒక్క విమానం కొనుగోలుచేశారు.
- రఫేల్ యుద్ధకొనుగోలులో రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడినట్లే ఇక్కడ కేసీఆర్ కూడా రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు. పేదల భూములు గుంజుకుంటున్నారు. 35 వేల కోట్ల ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు ప్రాజెక్టు అంచనా పెంచారు.
- తెలంగాణలోని యువత శక్తిని ఒక కుటుంబం సొమ్ము చేసుకుంటోంది. యువత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి.
- రాష్ట్రంలో, దేశంలో ప్రజల గొంతులను అణిచేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, తెలంగాణలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ లను తొలగించారు.