మరింత దూరం పెరిగిందా?
గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య మరింత దూరాన్ని పెంచాయి.
గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య మరింత దూరాన్ని పెంచాయి. సాయంత్రం జరిగే ఎట్ హోం కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదు. ఉదయం జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ లు మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ జెండా వందనం అనంతరం తమిళిసై ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు. అక్కడ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి చేరుకుంటారు. సాయంత్రం ఎట్ హోం కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు.
గత రెండేళ్లుగా...
గత రెండేళ్లుగా గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. ఇటీవల రాష్ట్రపతి పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు మాత్రమే ముఖ్యమంత్రి, గవర్నర్ ఒకే వేదికపై కన్పించారు. అంతకు ముందు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మిగిలిన కార్యక్రమాలకు మంత్రులు మాత్రమే హాజరవుతున్నారు. గవర్నర్ ముఖ్యమైన బిల్లులును పెండింగ్ లో పెడుతున్నారని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రొటోకాల్ విషయంలో తనను పట్టించుకోవడం లేదని గవర్నర్ కినుక వహించారు. పాండిచ్చేరి వెళ్లడానికి కూడా ఆమె సొంత ఖర్చులతోనే విమానాన్ని సమకూర్చుకున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలేకే తానే సొంతంగా విమానాన్ని సమకూర్చుకుని వెళ్లారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయంగా...
దీంతో పాటు రాజకీయంగా వచ్చిన తేడా కారణంగానే రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడటం కూడా గవర్నర్ ఆగ్రహానికి కారణంగా చెతున్నారు. ఇక గత బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ను ఆహ్వానించలేదు. వచ్చే నెలలో తిరిగి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమమయ్యే అవకాశాలున్నాయి. బిల్లులు పెండింగ్ లో పెట్టకుండా చట్ట ప్రకారం తిరస్కరిస్తే తదుపరి చర్యలకు తాము ఉపక్రమిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో మరింత గ్యాప్ పెరిగిందనే అనుకోవాలి.
ఎట్ హోం కు కూడా...
కానీ గవర్నర్ మాత్రం బిల్లులు పెండింగ్ లో పెట్టి అధికారులను వివరణ కోరుతున్నారంటున్నారు. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం కించపర్చేలా వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు సయితం ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను గౌరవించాలని కేసీఆర్ కు తెలియదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ పై నేరుగా విమర్శలు చేస్తూ నిందలు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగే ఎట్ హోం కార్యక్రమానికి అధికార పార్టీ నుంచి మంత్రులు కూడా హజరయ్యే అవకాశం కన్పించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.