నోటు రద్దు చేసింది... ఇందుకేనట

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయలనోటును ఉపసంహరించుకుంది.దీనికి కారణాలున్నాయంటున్నారు

Update: 2023-05-20 06:30 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయలనోటును ఉపసంహరించుకుంది. అంటే రద్దు కాదు. వెనక్కు తీసుకోవడన్న మాట. ఏ రాయి అయితేనేం పళ్లు ఊడగొట్టుకోవడానికి... అన్నట్లు కీలక నిర్ణయం ఆర్బీఐ తీసుకుంది. గతంలో నోట్ల రద్దును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తే.. ఈసారి మాత్రం నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రకటన వచ్చింది. గత కొద్ది రోజులుగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజల వద్ద రెండు నోట్లు అందుబాటులో లేవు. ఎందుకంటే ఏటీఎంలలో గత రెండేళ్ల నుంచి రావడం లేదు. అప్పుడే అనుమానం వచ్చింది.

ఎన్నికల కోసమే...
అయితే రెండు వేల నోట్ల రద్దు చేయడం లేదని ఆర్బీఐ అప్పట్లో ఒక ప్రకటన చేసింది. దీంతో జనం కూడా నమ్మారు. అయితే రెండు వేల నోట్లు రద్దు జరిగింది ఇందుకేనంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది కీలకమైన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. అయితే ఎక్కువగా రెండు వేల రూపాయల నోట్లు రాజకీయ నేతల వద్దనే ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. వ్యాపారులు, రాజకీయ నేతలే రెండు వేల నోట్లు కోట్ల విలువైనవి దాచి పెట్టుకున్నారంటున్నారు.
రాజకీయ నేతలు... వ్యాపారులు...
ఓటర్లకు సులువుగా పంచేందుకు రెండు వేల నోట్లు పనికి వస్తుండటంతో పొలిటికల్ పార్టీలన్నీ రెండు వేల నోట్లను తమ వద్ద ఉంచుకున్నాయి. ఇప్పుడు ఓటుకు రెండు నుంచి నాలుగు వేలు పలుకుంది. దీంతో ఓటర్లకు పంచడం కూడా ఈ నోటు అయితే సులువు అని చెబుతుండటంతో అధిక మొత్తంలో నోట్లను దాచి పెట్టుకున్నారంటున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే నేతలు తమ ముఖ్యమైన అనుచరుల ఇళ్లలో వాటిని నిల్వ ఉంచారన్న సమాచారమూ ఉందంటున్నారు. అందుకే ఒక్కసారిగా ఆర్బీఐ ఉపసంహరించుకోవడంతో రాజకీయ నేతలు, వ్యాపారులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు.
రియల్ వ్యాపారం...
ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశాలున్నాయంటున్నారు. ఎక్కువ మంది రియల్ వ్యాపారులు నల్లధనాన్ని కూడబెట్టడంలో భాగంగా ఈ రెండువేల నోట్లను పెద్దయెత్తున దాచి పెట్టారంటున్నారు. దాదాపు మూడున్నర లక్షల కోట్ల రెండు వేల నోట్లు జనాల దగ్గర ఉన్నాయని ఆర్బీఐ చెబుతుంది. కానీ సామాన్యులు కాదు. వారంతా వ్యాపారులు, రాజకీయ నేతలే. ఇప్పుడు విపక్షాలను దెబ్బకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా రెండు వేల నోటు ఉపసంహరణ ప్రకటనను ఆర్బీఐ ద్వారా చేయించిందంటున్నారు. మొత్తం నోటు పోటు తో పొలిటికల్ లీడర్స్ నానాయాతన పడక తప్పదు. వారు ఆ నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. మరి ఎన్ని నోట్లు తిరిగి బ్యాంకుకు వస్తాయన్నది సెప్టంబరు 30వ తేదీ నాటికి కాని తేలదు.


Tags:    

Similar News