వైఎస్ బాటలోనే రేవంత్... అందుకే అలా?

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా ఆయనకు సంతోషం లేదు. పార్టీని బలోపేతం చేయాలన్నప్రయత్నాలను వెనక్కు లాగే వాళ్లే ఎక్కువయ్యారు

Update: 2021-12-25 05:04 GMT

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా ఆయనకు సంతోషం లేదు. పార్టీని బలోపేతం చేయాలన్న ఆయన ప్రయత్నాలను వెనక్కు లాగే వాళ్లే ఎక్కువయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి బలమైన నేతలనే పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు. అయినా అధినాయకత్వం వద్ద ఉన్న పట్టుతో వైఎస్ నెట్టుకురాగలిగారు. పార్టీ సీనియర్లను కలుపుకుని పోతూ కాంగ్రెస్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు అధికారాన్ని తెచ్చిపెట్టారు. వైఎస్ తెచ్చిపెట్టిన విజయమే చివరదిగా మారింది.

అంతటి బలమైన నేత....
తర్వాత వైఎస్ అంతటి బలమైన నేత కాంగ్రెస్ కు దొరకలేదు. అయితే మాస్ ఇమేజ్, వాగ్దాటి పటిమ వంటివి ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంపికయి నెలలు మాత్రమే గడుస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో సీనియర్లను కలుపుకుని పోయే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తొలినాళ్లలో కొంత దూకుడుగా వ్యవహరించినా పరిస్థితులను అర్ధం చేసుకుని రేవంత్ సీనియర్లను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ నేతలను....
పీసీసీ చీఫ్ గా ఎంపికయిన తర్వాత వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురయినా రేవంత్ రెడ్డి ఆ ఓటమిని తనపైనే వేసుకున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ పదవికి ఎంపికయితే తాను గాంధీ భవన్ లోకి అడుగుపెట్టబోనని శపథం చేసిన సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద అంత పట్టులేదు. కేవలం రాహుల్ గాంధీతోనే కొంత మేర పరిచయాలున్నాయి.
కొంత తగ్గయినా....?
అయితే మిగిలిన సీనియర్ నేతలకు హైకమాండ్ వద్ద గట్టి పట్టుంది. వారు ఎప్పుడైనా నేరుగా సోనియాగాంధీని కలిసే వెసులుబాటు ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తగ్గాడంటున్నారు. డీఎస్ చేరిక విషయంలోనూ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకుని హైకమాండ్ చెవిలో వేశారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే నడవాలని రేవంత్ భావిస్తున్నారు. అందరినీ కలుపుకుని పోతూ వారి వద్దనే నిర్ణయాలను ప్రకటిస్తూ, చివరకు పాదయాత్రతో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News