ఇద్దరినీ పీకి పారేయడమే బెటరా?

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్లే కనిపిస్తుంది.

Update: 2022-11-27 03:22 GMT

ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. రాహుల్ గాంధీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పెద్ద బాధ్యతనే భుజాలకెత్తుకున్నారు. కాళ్లు అరిగిపోయేలా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ లోనూ సంక్షోభం నెలకొంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్లే కనిపిస్తుంది. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. ఒకవర్గంపై మరొకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు.

అధ్యక్ష పదవి ఇస్తామన్నా...
అశోక్ గెహ్లాత్ తనకు ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇస్తామన్నా అంగీకరించలేదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అని చేసిన తీర్మానంతో ఆయన ముఖ్యమంత్రి పదవికోసం పార్టీ అధ్యక్ష పదవిని కూడా తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో తన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. కానీ పైలట్ వర్గం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సచిన్ పైలట్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గెహ్లాత్ నాయకత్వంలో రెండుసార్లు కాంగ్రెస్ ఓటమి పాలయిందని గుర్తు చేస్తున్నారు.

రెండు వర్గాలు...
దీనికి పోటీగా అశోక్ గెహ్లాత్ కూడా తీవ్రంగానే స్పందించారు. ముఖ్యమంత్రిగా పైలట్ ను మినహాయించి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో రచ్చ మరింత హీటెక్కింది. పైలట్ ను మాత్రం ముఖ్యమంత్రిగా అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పడంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీగానే తలపడుతున్నాయని చెప్పాలి. అధినాయకత్వాన్ని కూడా గెహ్లాత్ లెక్క చేయడం లేదు. స్వయంగా సోనియా గాంధీ పిలిచి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేయాలని చెప్పినా ఆయన అంగీకరించకపోవడంతో పార్టీ హైకమాండ్ కొంత ఆగ్రహంతో ఉంది.

సెంటిమెంట్ ఉన్నా...
రాజస్థాన్ లో సహజంగా ఒకసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరోసారి రాదు. అది సెంటిమెంట్ కావచ్చు. ప్రజలు అలా నిర్ణయించవచ్చు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగైనా తీసుకు రావాలని అందరూ కలసి పనిచేయాల్సిన తరుణంలో ఎవరికి వారే వర్గాలు విడిపోయి రోడ్డున పడ్డారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలిచే ఛాన్స్ లు పది శాతం కూడా లేవన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బీజేపీకి ఏకపక్షంగా విజయం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. మరోవైపు హుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో ప్రవేశిస్తున్న తరుణంలో రెండు వర్గాల మధ్య విభేదాలు ఏ దిశకు దారితీస్తాయన్న ఆందోళన పార్టీ అభిమానుల్లో నెలకొంది.


Tags:    

Similar News