రోజాకు రోజులు బాగాలేనట్లుంది
ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలోతెలుగుదేశం నుంచి పెద్దగా ఇబ్బంది లేదు. సొంత పార్టీలోనే ఆమెకు శత్రువులు ఎక్కువయ్యారు.
సినీ నటిగా అలరించారు. బుల్లి తెరపై కూడా స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనూ ఊహించని విధంగా ఎదిగారు. కానీ అదే ఆమె సొంత పార్టీలో మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. ఆర్కే రోజా రెండు సార్లు నగరి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచి మూడోసారి నగరి నుంచి గెలిచేందుకు రోజా నిత్యం జనం మధ్యనే ఉంటున్నారు. వారంలో నాలుగు రోజులు రోజా నియోజకవర్గంలోనే ఉంటారు.
టీడీపీ నుంచి....
ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ పెద్దగా లేదు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతి చెందిన తర్వాత రోజాకు అక్కడ తిరుగులేకుండా పోయింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులున్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం రోజాకు మరింత కలసి వస్తోంది. నగరిలో కొత్త నేత కోసం చంద్రబాబు అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ బలంగా లేకపోయినా రోజాకు మాత్రం రాజకీయ తలనొప్పులు తప్పేట్లు లేవు.
రెండోసారి గెలిచిన తర్వాత....
సొంత పార్టీలోనే ఆమెకు శత్రువులు ఎక్కువయ్యారు. రెండోసారి గెలిచిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసంతృప్తి ఎక్కువయింది. పార్టీ అధినాయకత్వం కూడా ఒకసారి రోజాకు అనుకూలంగా, మరొకసారి ఆమె వ్యతిరేక వర్గానికి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుండటం విశేషం. రోజాను వ్యతిరేకిస్తున్న కేజే కుమార్ సతీమణి శాంతికి ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగించారు. ఇది రోజా జీర్ణించుకోలేని విషయం. స్థానికసంస్థల ఎన్నికల సమయంలోనూ రోజాకు వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి.
జగన్ పుట్టినరోజు వేడుకలకు....
అయితే తాను ఫైర్ బ్రాండ్ కావడంతో అధిష్టానాన్ని ఒప్పించి తన వారికే ఎంపీపీ వంటి పదవులు రోజా ఇప్పించుకోగలిగారు. కానీ రోజురోజుకూ రోజాపై అసంతృప్తి నేతలు కాలు దువ్వుతున్నారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్బంగా రోజా పెద్దయెత్తున నియోజకవర్గంలో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ రోజా వ్యతిరేక వర్గం నేతలయిన కేజే కుమార్, శాంతి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మురళీ ధర్ రెడ్డిలు వేరుగా జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు రెడీ అయ్యారు. పార్టీకి కష్టపడిన వారికి రోజా అన్యాయం చేస్తున్నారన్నది వీరి ఆరోపణ. ఇది పార్టీ క్యాడర్ ను మాత్రమే కాదు జనాన్ని కూడా అయోమయంలో పడేసే అంశమే.