Jamili Elections: జమిలి ఎన్నికలు ఎవరికి లాభం? అసలు ఎప్పుడు జరుగుతాయంటే?
జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. చంద్రబాబు ఇందుకు సిద్దమవుతారా? అన్నదే ప్రశ్న
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశమంతా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. గతం నుంచే జమిలి ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ మూడోసారి అధికారం రావడంతో ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇందుకు చాలా సమయం పడుతుందన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇప్పటికే రామ్‌నాధ్ కోవిండ్ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో పాటు రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచనగా ఉంది.
బాబు అంగీకరిస్తేనే?
అయితే ఇందుకు ప్రధాన అడ్డంకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలకు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే ఇటు చంద్రబాబు, అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల మద్దతు అవసరం అవుతుంది. అయితే చంద్రబాబు అంత సులువుగా మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారని అనుకోలేం. ఎందుకంటే 2014 అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన జమిలీ ప్రతిపాదనను చంద్రబాబు పార్టీ వ్యతిరేకించింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నారు. అయినా సరే ఆయన మధ్యంతర ఎన్నికలను కోరుకోను కాక కోరు అన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 175 స్థానాలకు కూటమికి 164 స్థానాలు సాధించడం ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇదే ప్రధమం కావడం కూడా జమిలికి అంగీకరించక పోవడానికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది.
ప్రజల మూడ్ ఎప్పటికప్పుడు...
అంతే కాకుండా ఎన్నికలు జరిగితే అదే రకమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. చంద్రబాబు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే ప్రజల మూడ్ ఎప్పటికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచినా పింఛను మినహా మరే ఇతర సూపర్ సిక్స్ హామీలను అమలుచేయలేదు. ఎంత లేదని భావించినా ప్రజల్లో అసంతృప్తి మాత్రం ఉంటుందన్న అంచనా వేయలేని అనుభవం ఆయనకు లేక కాదు. అదే సమయంలో మరోసారి ఎన్నికలు అంటే ఆర్థిక భారం నేతలపైనా, పార్టీపైనా పడుతుందని ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు బలంగా ఉన్న సమయంలో జమిలీ పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా మూర్ఖమైన చర్యగా ఆయన భావిస్తారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ఆలోచనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న సమయంలో జమిలీ ఎన్నికల కుదుపుతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనాలని ఆయన కూడా ఆలోచన చేయవచ్చు.
చాలా తతంగం...
చంద్రబాబు, పవన్ మద్దతు లేకుండా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును బుజ్జగించినా పెద్దగా ప్రయోజనం జమిలీ ఎన్నికల విషయంలో ఉండక పోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం కావడంతో కేంద్రం కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. దీంతో పాటు శీతాకాల సమావేశాల్లో జమిలి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పటికీ తర్వాత రామ్‌నాధ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అంతే కాకుండా ముఖ్యంగా జనగణన పూర్తి కావాల్సి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే ఆచరణలో కొంత కష్టమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మరో పదిహేను పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మళ్లీ 2029 వరకూ ఎన్నికలు జరిగే అవకాశాలు కష్టమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.