రేవంత్ రూట్ మ్యాప్ రెడీ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రూట్ మ్యాప్ దాదాపుగా రెడీ అయిపోయింది
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రూట్ మ్యాప్ దాదాపుగా రెడీ అయిపోయింది. ఈ నెల 26వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. భద్రాచలం సీతా రామచంద్రమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 126 రోజుల పాటు పాదయాత్రను డిజైన్ చేశారు. మే నెల చివర జూన్ మొదటి వారంలో పాదయాత్ర పూర్తయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 99 నియోజకవర్గాలను టచ్ చేసే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. రోజుకు 18 కిలోమీటర్లు ప్రయాణించేలా పాదయాత్రను ప్లాన్ చేశారు.
భద్రాచలంలో మొదలయి...
భద్రాచలంలో మొదలయ్యే పాదయాత్ర ఆదిలాబాద్ లో ముగియనుంది. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ఈ పాదయాత్రను రేవంత్ రెడ్డి చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చించిన తర్వాతనే ఈ పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏఐసీసీ ఆమోదం తెలపలేదు. అందుకే రేవంత్ రెడ్డి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కంటిన్యూగా ఇది చేపట్టనుండటంతో పెద్దగా అభ్యంతరాలు చెప్పే అవకాశమేదీ ఉండదని కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.
ఏఐసీసీ నుంచి...
కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం ఏఐసీపీ ఆమోదముద్ర రేవంత్ పాదయాత్రకు వేయలేదని చెబుతున్నారు. ఏఐసీసీ నుంచి అనుమతి లభించిన తర్వాతనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. పార్టీ బలోపేతం కోసమే పాదయాత్ర కు ప్లాన్ చేసినందున కాంగ్రెస్ హైకమాండ్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని అంటున్నారు. ఓపిక, ఆలోచన ఉంటే రేవంత్ తో కలసి సీనియర్ నేతలు కూడా పాదయాత్రలో పాల్గొనవచ్చన్న సూచనలు ఏఐసీీసీ నుంచి అందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రేవంత్ పాదయాత్రలో పాల్గొనవచ్చని కాంగ్రెస్ అధిష్టానం చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నెల 11న తొలిసారి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిమాణిక్ రావు రానున్నారు. ఆ సందర్భంగా దీనిపై క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. పాదయాత్రకు సన్నాహాలు అయితే మాత్రం జరుగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో...
పార్టీ ప్రస్తుతం తెలంగాణలో బలహీనంగా ఉంది. పటిష్టమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీ దూకుడు దెబ్బకు కాంగ్రెస్ కొంత వెనకబడి ఉందనే చెప్పాలి. పార్టీలో ఐక్యత లేక ప్రజల్లో నమ్మకం కూడా లేదు. క్యాడర్ లో నిస్తేజాన్ని తొలగించాలన్నా, ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నా రేవంత్ రెడ్డి పాదయాత్ర పార్టీకి టానిక్ లా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా రెండు సార్లు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. మూడోసారి కూడా పవర్ లోకి రాకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని హైకమాండ్ కు తెలియంది కాదు. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ కూడా గతంలో పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. త్వరలోనే ఏఐసీీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న నమ్మకంతో రేవంత్ ఉన్నారు. మరిఏం జరుగుతుందో చూడాలి.