హైడ్రామా.. ప్రత్యేక హోదాపై గేమ్స్

అజెండాలో హోదా అంశాన్ని తొలగించినా దానిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తుందని అధికార పార్టీ నేతలకు చెబుతున్నారట.

Update: 2022-02-13 01:41 GMT

నిన్నటి వరకూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. ఈ మాట అన్నది ఎవరో కాదు. భారతీయ జనతా పార్టీ పెద్దలే. కావాలంటే ప్యాకేజీ తీసుకోండి. అంతేకాని హోదా విషయాన్ని మర్చిపోండి అని బీజేపీ అగ్ర నేతలు నేరుగా చెప్పారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అందుకోవడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు హోదా ఎందుకు నాలుక గీసుకోవడానికా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీ తమ ఎంపీల చేత రాజీనామా చేయించారు. అయినా ప్రత్యేక హోదా రాలేదు. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు మాట.

ఎన్నికల తర్వాత ....
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు. ఆయన సీఎంగా ఢిల్లీ తొలి పర్యటనలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీని ఏమీ చేయలేమని, కేవలం బతిమాలుకోవడమే తప్ప మరో దారి లేదని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా వినతి పత్రంలో చేరుస్తున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ప్రత్యేక హోదాను మర్చి పోవాలనే చెబుతూ వస్తుంది.
మళ్లీ హోదా అంశాన్ని....
అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్ కు పంపిన అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండటం మరోసారి ఆశలు రేపింది. అయితే హోదాను అంత సులువుగా ఇస్తారా? అంటే లేదనే చెప్పాలి.
ఆశలు పెట్టుకోవద్దు...
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఏం సాధించారని ప్రశ్నిస్తుంది. వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటు సమావేశాల్లో హోదా విషయాన్ని లేవనెత్తుతున్నారు. మోదీ ప్రధాని పదిలో ఉండగా, బీజేపీ అధికారంలో కొనసాగినంత కాలం ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వరన్నది వాస్తవం. కేవలం ఎన్నికల కోసం, పార్టీలను, ప్రజలను మభ్యపెట్టేందుకే బీజేపీ ఈ హోదా డ్రామా మొదలు పెట్టిందనుకోవాలి. అయితే అజెండాలో హోదా అంశాన్ని తొలగించినా దానిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తుందని అధికార పార్టీ నేతలకు చెబుతున్నారట.


Tags:    

Similar News